దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పేరుకు అగ్నిపథ్ . కానీ కడుపులు మండిపోయిన ప్రతి ఒక్కరిలోనూ ఆ ఫైర్ కనిపిస్తోంది. ప్రభుత్వాలపై అసహనం.. అన్యాయమైపోతున్నామన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. నిన్న కోనసీమ అయినా.. మొన్న యూపీ అయినా.. దేశమంతా ఈ రోజు జరుగుతున్న ఆందోళనల్లో కనిపిస్తోంది అదే. ఆర్మీ ఉద్యోగాల కోసం విపరీతంగా శ్రమిస్తూంటే.. చివరికి వాటిని కాంట్రాక్ట్ జాబులుగా మార్చేసిన వైనం అందరికీ మండిపోయేలా చేసింది. వీటిపై ఆశలు పెట్టుకున్న వారంతా రోడ్డెక్కారు. ఆ ఆగ్రహం కట్టు తప్పింది. రైళ్లు తగలబడిపోయాయి. ఇంకా ఆరలేదు. ఆరుతుందన్న నమ్మకం లేదు.
కేంద్రం తమ విధానంలో మార్పు ఉండబోదని ప్రకటించి.. మరింత నిప్పు రాజేస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ఒక్కో వర్గంలో అదే ఆగ్రహం కనిపిస్తోంది. తమకూ ఇలాంటి ఓ అనుభవం ఎదురవ్వాలని చూస్తోంది. అలాంటిది జరిగినప్పుడు ఆయా వర్గాలూ రోడ్ల మీదకు వస్తాయి. ఏదో ఓ కారణం దొరికితే చాలు తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని బయట పెట్టడానికి ప్రజలు రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు తమకు మెజార్టీ ఉందని ఏకపక్షంగా ఎలాంటి చర్చలు లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తూండటం ఎంత ప్రమాదకరమో ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.
ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని.. వారితో సంబంధం లేకుండా అన్నీ చేసేస్తామంటే ఎవరూ కామ్‌గా ఉండరని ప్రజలు ఇప్పుడు నిరూపిస్తున్నారు. రాజుకున్న ఈ అసంతృప్తి మంటలను చల్లార్చడం ప్రభుత్వాలకు అంత తేలిక కాదు. ఇంటర్నెట్ను ఆపేస్తాం … అందర్నీ అరెస్ట్ చేస్తామని ఎన్ని పిల్లిమొగ్గలేస్తే అంత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అసలు సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించే ప్రయత్నం జరిగితే మళ్లీ కామ్ అవుతుంది. లేకపోతే.. ఇవి అలా పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.