తాము అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తామని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు మహిళల్ని నట్టేట ముంచుతున్నారు. ఆ పెన్షన్ పథకం అమలు చేయకపోగా… తక్కువ వయసు నుంచి పెన్షన్ అందుకుంటున్న ఒంటరి మహిళలకు ఆ ఆసరా లేకుండా చేస్తున్నారు. యాభై ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ ఇస్తామని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒంటరి గ్రామాల్లో 30 ఏళ్ల నుంచి.. పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు యాభై ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే యాభై ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే ఇక నుంచి పెన్షన్ ఇస్తారు.
సాధారణంగా ఒంటరి మహిళలు అంటే పెళ్లి కాని వాళ్లు, డైవర్స్ తీసుకున్న వాళ్లు, భర్త చనిపోయిన వాళ్లు ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు అయినా 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు . విడాకులు తీసుకున్న వారికీ అంతే. భర్త చనిపోయి ఉంటే గ్రామాల్లో 30 పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లోనూ యాభై ఏళ్లు నిండి ఉండాలని ప్రభుత్వం తేల్చేసింది.
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్దిదారులను వీలైనంతగా తగ్గించేందుకు ప్రయత్నం చేసుకుంటోంది. పలు పథకాల్లో లబ్దిదారులను తగ్గించేయగా ఇప్పుడు ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి వర్తింప చేస్తే పెద్ద ఎత్తున మహిళలు నష్టపోతారు. ఇప్పటికిప్పుడు ఇలా పెన్షన్ల వయసును అనూహ్యంగా పెంచేస్తే లక్షల మంది ఒంటరి మహిళలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.