తొలి తెలుగు ఓటీటీ ఆహా…. ప్రయోగాత్మకంగా మొదలెట్టిన తెలుగు ఇండియన్ ఐడల్ సంగీత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 15 వారాల పాటు ఓటీటీ వేదికగా బుల్లి తెర అభిమానుల్ని అలరించిన ఇండియన్ ఐడల్… సూపర్ హిట్ గా నిలిచింది. శుక్రవారం టెలీకాస్ట్ అయిన గ్రాండ్ ఫినాలేలో.. వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ సీజన్ అంతా నిలకడగా రాణిస్తూ… ఎపిసోడ్ ఎపిసోడ్‌కీ అభిమానుల్ని పెంచుకుంటున్న వాగ్దేవి ని విజేతగా ప్రకటించిన చిరంజీవి.. తన చేతుల మీదుగానే ట్రోఫీని అందజేశారు. వాగ్దేవికి ఆహా నుంచి రూ.10 లక్షలు నగదు బహుమతిగా అందాయి. దాంతో పాటుగా కొన్ని వాణిజ్య సంస్థల నుంచి మరో రూ.6 లక్షలు అందాయి. అంతే కాదు… గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రంలో గాయనిగా అవకాశం కూడా దక్కించుకుంది. మొదటి రన్నరప్ శ్రీనివాస్‌కు 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి రూ.2 లక్షల నగదు బహుమతి దక్కింది. వైష్ణవి పాట పాడే విధానం, ఆమె గాన మాధూర్యం చిరుకి ఎంతో నచ్చాయి. దాంతో గాడ్ ఫాదర్లో వైష్ణవితో ఓ పాట పాడిస్తానని ఈ సందర్భంగా చిరు మాట ఇవ్వడం విశేషం. ఈ గ్రాండ్ ఫినాలేకి రానా, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ షో అంతటికీ తమన్, నిత్యమీనన్, కార్తీక్ న్యాయ నిర్ఱేతలుగా వ్యవహరించారు. గాయకుడు శ్రీరామచంద్ర యాంకర్ పాత్ర పోషించాడు. ఇండియన్‌ఐడల్ మొదటి అంకం దిగ్విజయంగా పూర్తవ్వడంతో రెండో చాప్టర్‌కి కూడా దారులు తెరచుకొన్నట్టైంది. సీజన్ 2 మరిన్ని కొత్త సొబగులతో ముస్తామవుతుందని ఆహా ఇప్పటికే ప్రకటించేసింది.