అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని సీఎం జగన్ అందర్నీ ఊరించారు. లక్షల మంది అభ్యర్థులు ఆశపడ్డారు. మూడేళ్లయిందది ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా.. రేషనలైజేషన్ పేరుతో పూర్తిగా స్కూళ్లను తగ్గించేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచుతున్నారు. ఈ సంస్కరణల వల్ల ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయకుండా వ్యూహం పన్నుతున్నారన్న అనుమానాలొస్తూంటే.. ఇప్పుడు బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నారు . అంటే బైజూస్ ఆన్ లైన్ పాఠాలు వినిపిస్తున్నారు. మరి మన టీచర్లు ఏం చేస్తారు ?
బైజూస్ కొన్ని రికార్డెడ్ పాఠాలు వినిపిస్తుంది. మరికొన్ని క్లాసులు తీసుకుంటుంది. ఆ సంస్థ కూడా టీచర్లను రిక్రూట్ చేసుకుంటోంది. కానీ ఆ సంస్థ విధి విధానాలుతేడాగా ఉండటంతో చాలా మంది టీచర్లు మధ్యలోనే గుడ్ బై చెబుతున్నారు. అయితే చదువు చెప్పడమే కాబట్టి అర్హత లేని వారిని కూడా అవసరం కోసం నియమించుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరు నియమించినా.. బైజూస్ విద్యార్థులకు ఆన్ లైన్లో వాళ్లే పాఠాలు చెబుతారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ వారే చెబుతారు. క్లాసులో కోఆర్డినేట్ చేయడానికి ఓ టీచర్ ఉంటే సరిపోతుంది. అంటే క్లాస్ మొత్తానికి ఓ టీచర్‌తో సరి పెట్టవచ్చు.
ఇప్పుడు సబ్జెక్ట్ నిపుణులు కూడా అవసరం లేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం బైజూస్‌కు ఇంత బల్క్‌గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఆ సంస్థ మరింత బలోపేతం అవుతుంది కానీ.. ఏపీ విద్యావ్యవస్థ పరిస్థితి ఏమిటి? ఆ సంస్థ కు ఏటా ఐదారు వందల కోట్లు పెట్టే బదులు … టీచర్లను నియమించి.. మంచి చదువులు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయరు. కారణం ఏదైనా ఇక ఏపీలో ఉపాధ్యాయులకు ప్రైవేటు ఉద్యోగాలే గతి. ఇంకా కావాలంటే బైజూస్‌లో చేరి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్చు.