పవన్ కల్యాణ్ చేస్తున్న రెండు పడవల ప్రయాణం.. నిర్మాతల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. పవన్ ఎప్పుడు షూటింగ్ అంటాడో, ఎప్పుడు రాజకీయాలంటాడో తెలీని పరిస్థితి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో `హరి హర వీరమల్లు` బాగా నలిగిపోతోంది. ఇదో పిరియాడికల్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై చాలా ఖర్చు పెట్టారు. షూటింగు చాలాసార్లు పవన్ వల్ల వాయిదా పడింది. వేసిన సెట్లే మళ్లీ వేయడం, అందరి కాల్షీట్లూ సర్దుబాటు చేసుకోవడం నిర్మాత ఏ.ఎం.రత్నంపై తలకు మించిన భారాన్ని మోపాయి. పవన్ కూడా ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి `వదిలించుకోవాలి` అనే నిర్ణయానికి వచ్చేశాడు. పవన్ పొలిటికల్ టూర్ వల్ల మరోసారి వాయిదాల పర్వం ఎదుర్కొంటోంది వీరమల్లు. అయితే… ఎప్పుడు షూటింగ్ మొదలెట్టినా, నిరవధిక షెడ్యూల్ తో ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చాడట. ఆగస్టులోగా ఈ సినిమాని పూర్తి చేమయాలన్నది పవన్ టార్గెట్. క్రిష్‌కి కూడా అదే చెప్పాడట. ఆగస్టులోగా తనపై తీయాల్సిన సీన్లన్నీ తీసుకోమని, ఆ తరవాత.. వేరే సినిమాని తన కాల్షీట్లు ఇచ్చేస్తానని అన్నాడట. పవన్ దృష్టిలో ఉన్న ఆ వేరే సినిమా… `వినోదయ సీతమ్` రీమేక్. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఇది. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటించబోతున్నారు. 3 నెలల్లో ఈ రీమేక్ పూర్తి చేయాలన్నది పవన్ టార్గెట్. అంటే… 2022లో పవన్ ఈ రెండు సినిమాల్నీ పూర్తి చేయాలి. 2023 సంక్రాంతికి హరి హర వీరమల్లు వస్తుంది. వేసవిలో… వీనోదయ సీతమ్ రిలీజ్ అవుతుంది. 2023 జనవరి నుంచి.. హరీష్ శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతానికి పవన్ ప్లానింగ్ ఇదే.