పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటుంటే… ఆయన కుమార్తె టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి రెండు సార్లు మేయర్ సీటు ఆశించి భంగపడ్డారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా రాలేదు. దీంతో ఆమె కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించగలిగారు. రేవంత్ రెడ్డిని కలిసి తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికారు.
మంచి భవిష్యత్తు కోసమే … పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాని మీడియాకు విజయారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతూండటం.. సొంత ఇంటి పార్టీ లోకి వస్తున్న అనే భావన ఉందన్నారు. టీఆర్ఎస్ లో అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినా సరైన గుర్తింపు దక్కలేదని.. తనకు టీఆర్ఎస్ ఒక బౌండరీ గీశారని తన శక్తి సామర్థ్యాలుచాటాలంటే.. కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని భావించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ రాలేదు. ఎన్నికలకు టైం ఉంది కాబట్టి టికెట్ గురించి ఇప్పుడే మాట్లాడని ఆమె ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నుంచి బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. పీజేఆర్‌కు అక్కడి బస్తీల్లో ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అన్న పేరుఉండేది. ఆ నియోజకవ్రగం విభజించాక.. ఆయన కుమారుడు జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. పీజేఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయనకు విజయారెడ్డి గట్టి పోటీ అవుతారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉంది.