బీజేపీకి చెందిన హైదరాబాద్, వరంగల్ కార్పొరేటర్లతో పాటు పలు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. టీఆర్ఎస్ కూడా అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీ చేతిలో కూడా కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి. కావాల్సినంత ధనబలం ఉంటుంది. దీంతో బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు సులువుగానే ఆ పార్టీ బుట్టలో పడిపోతున్నారు. వారిని పట్టుకొచ్చి కండువా కప్పి.. బీజేపీకి షాక్ అని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది బీజేపీని రెచ్చగొట్టడమే అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇలాంటివి బీజేపీ చేయాలంటే.. చేయాలని అనుకుంటే ఎలా ఉంటుందో చాలా రాష్ట్రాల్లో జరిగింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిందని గుర్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడు బీజేపీ కన్నా ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటోది టీఆర్ఎస్సే. సిట్టింగ్‌లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ సారి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు.ప్రశాంత్ కిషోర్ సర్వేలో గెలుస్తారు అని తెలిస్తేనే టిక్కెట్ ఇస్తారు. లేకపోతే లేదు. ఇప్పటికే చాలా మంంది ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్ ఏమిటో తేలిపోయింది. అందుకే వారు పక్క చూపులు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అసంతృప్తులను పట్టుకోవడంలో సాటిలేని నైపుణ్యం ఉంది.
బీజేపీ వర్గాలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతూ వస్తున్నాయి. చాలా మంది అంటే ఎంత మంది అనేది వాళ్లకీ తెలియదు కానీ… ఎంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది.. ఎంత మంది బీజేపీ ఆకర్ష్‌కు పడిపోతారో అంత మంది అని చెప్పుకోవచ్చు. వారు కనీసం యాభై మంది ఉంటారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేసేస్తున్నాయి. తమ కార్పొరేటర్లను లాగేసుకుంటున్న టీఆర్ఎస్కు అంతకు మించిన షాక్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటే ఇవ్వడం పెద్ద విషయం కాదు.. టైమింగ్‌ను బట్టి యాక్షన్ బయటకు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ జాతీయ నాయకుల్ని రెచ్చగొట్టాలనుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.