ఓ వ్యక్తి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని వృత్తి జీవితాన్ని వాడుకుని.. వారు నాశనం అయినా పర్వాలేదు తాము బాగుపడాలనే వ్యూహాల్లో రాజకీయ పార్టీలు ఆరితేరిపోతాయి. ఇలాంటి వాటిలో వైసీపీ రెండాకులు ఎక్కువే చదివింది. చిరంజీవిని వ్యక్తిగతంగా లంచ్‌కు పిలిచి.. అక్కడ రాజకీయాలు ఏమీ మాట్లాడకుండా ఆయన బయటకు వెళ్లగానే రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని ప్రచారం చేయడం ఆ పార్టీకే చెల్లుతుంది. ఇప్పుడు సినీ నటుడు విశాల్ వంతు. ఆయన అసలు ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. కానీ ఆయనపై వైసీపీ ముద్ర వేసేశారు.
చంద్రబాబుపై పోటీకి విశాల్ ను జగన్ ఒప్పించారని వైసీపీ వర్గాలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నాయి. ఆయన స్పందించకపోవడంతో నిజమేనని టీడీపీ వర్గాలు కూడా అనుకున్నాయి. అయితే తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ఆయన ఖండించిన రెండు రోజులకు విశాల్ కూడా స్పందించారు. తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అయినా ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదన్నారు. తన ప్రాధాన్యం ఇప్పుడు సినిమాలకు మాత్రమేనని .. ఏపీ రాజకీయాల్లోకి వచ్చి.. చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు.
కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆయనపై వైసీపీ ముద్ర పడిపోయింది. ఇది ఆయన కెరీర్‌గా చేటుచేయడం ఖాయంగా కనిపిస్తోంది. సినీ హీరోలు రాజకీయపరంగా విడిపోతే జరిగే నష్టాలను ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు చూశారు. ఇప్పుడా పరిస్థితి విశాల్‌కు ఎదురు కానుంది. దీనంతటికి వైసీపీ నేతల అత్యుత్సాహమే కారణం.