సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లో కనిపిస్తున్నాయి. బీజేపీతో పోటీగా టీఆర్ఎస్ కూడా చేస్తోంది. దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి.. యాడ్ ఏజెన్సీలకు ఉన్న హోర్డింగ్‌లన్నింటినీ టీఆర్ఎస్ బుక్ చేసుకుందని చెబుతున్నారు. ఇక ఇతర చోట్ల పెట్టే ఫ్లెక్సీల ఖర్చు నేతలు భరిస్తారు. ఇది ఎన్ని కోట్లు ఉంటుందో చెప్పడం కష్టం.
బీజేపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. టీఆర్ఎస్ ముందుగానే అన్నీ బుక్ చేసుకున్నా.. స్వాగతంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తోంది. టీఆర్ఎస్ అయితే బీజేపీ మొదటి పేజీల్లో ప్రకటనలు ఇవ్వకుండా తామే ముందుగా బుక్ చేసుకుంది. దీనికీ అదనపు ఖర్చు. ఇక సోషల్ మీడియాలో కూడా యుద్ధం చేసేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మీరేం చేయలేదంటే.. మీరు ఏం చేయలేదని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరి వైఫల్యాల్ని ఒకరు బయట పెడుతున్నారు. పెయిడ్ పోస్టులతో సోషల్ మీడియా సంస్థలకూ పెద్ద ఎఎత్తున ఆదాయం ఇస్తున్నారు
రాజకీయ పార్టీలు ఇంత భారీగా ఖర్చు పెట్టడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. దగ్గర్లో ఎన్నికల్లేవు. అయినా ఎదుటి పార్టీది పై చేయి అని అనిపించే ఏ ఒక్క అంశాన్ని వదిలి పెట్టడానికి టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరు. అందుకే బీజేపీతో పోటీ పడి మరీ పబ్లిసిటీ ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఇంకెలా ఉటుందో ?