జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు తొలి సారి ప్రారంభించిన జనవాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వ్యూహాత్మకంగా తొలి జనవాణిలో ప్రభుత్వం కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్ని వర్గాలను వేదికపై తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. వికలాంగులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం కలగకపోతే.. గతంలో వచ్చిన అనేక సబ్సిడీలు కూడా నిలిచిపోయాయి. అదే సమయంలో వికలాంగుల కార్పొరే్షన్కు కూడా నిధులు రావడం లేదు. ఈ పరిస్థితుల్ని పలువురు వికలాంగులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వేదికపై రాలేని వారి దగ్గరకు స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి ఆర్జీలు తీసుకున్నారు.
ఇక వైసీపీ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న మరో వర్గం మైనార్టీలు. వారి సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రతినిధులకు పవన్ సమయం ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని.. జనసేన ఓటు బ్యాంక్‌గా చూడదని హామీ ఇచ్చారు. ఇలాగే దళితులు.. ఇతర వర్గాలు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. వీరందరికీ పవన్ కల్యాణ్ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని వర్గాల సమస్యలను తెరపైకి తీసుకురావడంలో పవన్ కల్యాణ్ జనవాణి సక్సెస్ అయిందని అనుకోవచ్చు.
తొలి ఆర్జీని వ్యూహాత్మకంగా తాడేపల్లిలో సీఎం ఇంటి భద్రత పేరుతో తొలగించిన ఇళ్లల్లో నివాసం ఉండే వాలంటీర్ నుంచి తీసుకున్నారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పట్లో ఈ అంశం సంచలనం సృష్టించింది. ఆమె నుంచి తొలి ఆర్జీ తీసుకున్న పవన్ కల్యాణ్.. కార్యక్రమం మొత్తం ప్రభుత్వ బాధితులే ఉండేలా చూసుకున్నారు. 427 అర్జీలను పవన్ కళ్యాణ్ స్వీకరించారని జనసేన ప్రకటిచింది. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఈ వేదిక ద్వారా లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అధికారంతో పని లేకుండా ప్రజల సమస్యలు పరిష్కారానికి జనసేన ఎప్పుడూ ముందు ఉంటుందనే సందేశాన్ని పంపామని జనసేన ప్రకటించింది.