ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. కానీ రాజోలులో పార్టీ గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, జనసేనలకు సమాన బలం ఉంది. అయితే మిగతా రెండు పార్టీలతో పోలిస్తే.. జనసేనకు కాస్త బలం ఉంది. ఏదైనా రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే మూడో పార్టీ సునాయసంగా గెలుస్తోంది. ఆ మూడో పార్టీ ఏదనేది.. ప్రజల్లో ఉండే గాలిని బట్టి ఉంటుంది.
గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాదరావు 2014 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 318. నియోజకవర్గంలో ఆయన పలుకుబడికి ఈ ఓట్లే సాక్ష్యం. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడం ఖాయమయింది. టిక్కెట్ ఆయనకేనని హైకమాండ్ సంకేతాలు పంపింది. దీంతో పాత వైసీపీ నేతలంతా కట్ట కట్టుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా గత ఎన్నికల్లో రాపాకపై పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు కూడా రాజీనామా చేసేశారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియులు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఆ వర్గం వారంతా రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు.
జనసేనకు ఎమ్మెల్యే లేకుండా చేయాలని వైసీపీ చేసిన పనితో ఆ నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాపాకకు సొంత క్యాడర్ లేదు. ఆయనతో పాటు జనసేన నుంచి ఒక్కరు కూడా వైసీపీకి రారు. కానీ ఆయన రావడం వల్ల వైసీపీ నేతలంతా పార్టీ మారిపోతున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి చిందర వందర అయిపోయినట్లయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ లాభపడుతోంది. సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే ఉన్నారు. క్యాడర్ తో కలిసి నడుస్తున్నారు. పార్టీలోకి వస్తామన్న వారిని అడ్డుకోవడం లేదు. పార్టీ టిక్కెట్ తనకిచ్చినా ఎవరికిచ్చినా సరే అన్నట్లుగా ఆయన పని చేసుకుంటున్నారు.
మరో వైపు జనసేనకు లీడర్ లేకపోయినా క్యాడర్‌కు కొదవలేదు. కాపు సామాజికవర్గం.. పవన్ ఫ్యాన్స్ మొత్తం ఆ పార్టీ వైపే ఉంది. గతంలోలా మూడు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే… జనసేన పార్టీ తరపున నిలబడేవారికే అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ అభ్యర్థిత్వం కోసం ఇటీవల ఓ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి జనసేనలో చేరారు. ఇతరుల్లో కూడాచాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులుంటే.. జనసేనకే సిట్టింగ్ సీటు కింద చాన్స్ వస్తుంది కాబట్టి.. తిరుగు ఉండదు. ఎటు తిరిగి మొత్తానికి వైసీపీనే తన సిట్టింగ్ సీటును వ్యూహాత్మక తప్పిదాలతో రిస్క్ లో పెట్టుకుంది.