ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ పదవుల పంపకంలో సామాజిక న్యాయం ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ తనను సాంతం నాకేసిందని ఇంత కాలం కష్టపడినా ప్రత్యర్థులను తెచ్చి నెత్తి మీద పెట్టారనే అసంతృప్తితో రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు ఇంతకు ముందు ఓ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినట్లుగా చాలా మందికి తెలియదు. ఎందుకంటే పదవి అయితే ఇచ్చారు కానీ ఆయనకు అధికారం లేదా విధులు ఏమీ చెప్పలేదు. దాంతో పేరుకు సలహాదారుగా ఉండిపోయారు. ఆ సలహాదారు పదవికి కూడా రాజీనామా చేశారు.
అయితే వెంటనే ప్రభుత్వం మరో సలహాదారును నియమించింది. ఆయన పేరు వాసుదేవరెడ్డి. ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజీనామా చేసిన సలహాదారు… కొత్తగా నియమించిన సలహాదారుల శాఖలు మాత్రం ఒకటి కాదు. అయితే ఏపీలో సలహాదారు పదవులు ఇచ్చేది వారి సలహాలు తీసుకునేందుకు కాదు. రాజకీయ పరంగా ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రజాధనాన్ని ఇలా నేతలకు కట్టబెట్టేందుకు సలహాదారు పదవులు ఇస్తూ ఉంటారు. వారి సలహాలు తీసుకోవడం అనేదే ఉండదు. ఉత్తినే జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
అయితే ఇలాంటి వాటిలోనూ అత్యధికంగా ఒకే సామాజికవర్గం ఉండటమే .. వైసీపీ చేసే సామాజిక న్యాయం. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా.. ప్రజలు ఇంత దారుణమా అనుకుంటున్నా వెనక్కి తగ్గడం లేదు . ఇతర వర్గాలకు ఎందుకు చాన్సివ్వడం లేదంటున్నా లైట్ తీసుకుంటోంది. విశేషం ఏమిటంటే చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా… ఎక్కడో తెలంగాణకు చెందిన కృష్ణయ్య లాంటి వారిని తీసుకొచ్చి ఎంపీని చేసి.. సామాజిక న్యాయం చేసేశామని గట్టిగా ప్రచారం చేసుకోవడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం యాక్టివ్ గా ఉంటుంది.