హైదరాబాద్: మహాపుష్కరాల ప్రారంభంరోజే మహా విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఇవాళ ప్రారంభమైన గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తటంతో కోటగుమ్మం పుష్కరఘాట్వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించారు. మృతులలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారుగా చెబుతున్నారు. మరో 15మంది గాయాలపాలయ్యారు. వీరి పరిస్థితి సురక్షితమేనని అధికారులు చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన ఘాట్ పేరు ‘పుష్కర’ ఘాట్ కావటంతో దూరప్రాంతాల యాత్రికులు రాజమండ్రిలో దిగగానే నేరుగా ఈ ఘాట్కే వెళ్ళారు. బయటకు వచ్చే మార్గాలు ఇరుకుగా వుండటంతో లోపల రద్దీ పెరిగిపోయింది. బయటపడటానికి ఒకరినొకరుతోసుకోవడంతో పరిస్ధితి విషమించింది.
ఈ దుర్ఘటనకు అధికారులు, పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించటానికి వందల ఘాట్లు ఉన్నప్పటికీ ఆ ఘాట్లపైన అధికారులు అవగాహన కల్పించకపోవటమే దుర్ఘటనకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతోసహా పుణ్యస్నానాలాచరించటంకోసం మూడుగంటలపాటు సామాన్య భక్తులందరినీ ఆపేశారని స్థానికులు ఆరోపించారు. ఈ 12 రోజులలో ఎప్పుడు స్నానంచేసినా ఒకటేనని, భక్తులు తొందరపడొద్దని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా కంట్రోల్‌రూమ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తొక్కిసలాట దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని, ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావటంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రు.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గత కొద్దినెలలుగా పుష్కరాలపైన ఎంతో హడావుడి చేసిన ఏపీ ప్రభుత్వం, ఇవాళ్టి సంఘటనతో పెద్ద మచ్చను మూటగట్టుకున్నట్లయింది. ప్రతిపక్షాలు రేపటినుంచి ఈ ఘటనకుగానూ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడే అవకాశాలున్నాయి.