రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు బాధ్యులెవరన్న విషయంపై ఇప్పుడు పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదే తప్పంతా – అన్న ముద్ర వేయడానికి కాంగ్రెస్ సహా విపక్షాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్క మత ప్రచారకుల ప్రవచనాల వల్లనే భారీసంఖ్యలో యాత్రికులు వచ్చేశారనీ, దీంతో తొక్కిసలాట జరిగిందన్న వాదనలూ వినబడుతున్నాయి. మరి అలాంటప్పడు ఎవరి పాపం ఎంతెంత ?
27మంది పుష్కర యాత్రికుల మరణాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే, కాంగ్రెస్ తరఫున- సినీనటుడు, రాజకీయ నాయకుడైన చిరంజీవి మీడియాలో ఘాటుగానే స్పందించారు. `ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసినట్టు ఘనంగా చెప్పుకుందీ, ఇదేనా ఏర్పాట్లు? ఎంత మంది భక్తులు వచ్చినా ప్రశాంతంగా స్నానాదికాలు పూర్తి చేసుకోవడానికి సకల ఏర్పాట్లు చేశామని చంద్రబాబు స్వయంగా చెప్పారు. కానీ ఏంజరిగిందీ, మొదటి రోజు తొలి గంటల్లోనే ఇంతటి విషాదం జరిగింది’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.
ప్రతిపక్షాలన్నీ చంద్రబాబుదే తప్పని వేలెత్తిచూపడానికి శ్రాయశక్తులా కృషి చేస్తున్నాయి. సరే, ఇదంతా రాజకీయం అని సరిపెట్టుకుందాం. ఇంత మంది యాత్రికులు ఒక్కసారిగా పుష్కర స్నానాలు చేయాలని ఎందుకు అనుకున్నారు? దీనికి కారణాలేమిటోలోతుగా ఆలోచించాలి.
పుష్కరుడు ప్రవేశించిన తొలి ఘడియల్లో స్నానం చేస్తే చాలామంచిదని ఎవరో కొంతమంది స్వామీజీలు మీడియాలో పదేపదే చెప్పారట. ఈ తరహా ప్రవచనాలు యాత్రికులమీద ఘాటైన ప్రభావం చూపించాయి. ఇదో రకం మాస్ హిప్నటిజంగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. మరో విషయం ఏమంటే, గోదావరి నది తీరం వెంబడి ఎక్కడ స్నానం చేసినా ఫర్వాలేదని చెప్పకుండా కొందరు స్వామీజీలు, బాబాలు – `ఇదిగో, ఈ ఫలానా ఊర్లో ఫలానా ఘాట్ వద్ద స్నానం చేస్తే మరీ మంచిది… ‘ అంటూ చెప్పడంతో కొన్ని ప్రాంతాల్లో విపరీత రద్దీ ఏర్పడింది. కొన్ని చోట్ల అసలు రద్దీలేదు. అలాంటప్పుడు, ఈ తొక్కిసలాట ఘటనకు ఇలాంటి ప్రవచన కర్తల బాధ్యత లేదని ఎవరైనా ఎలా అనగలరు? ఇదంతా చూస్తుంటే ఇకపై ఆధ్యాత్మిక ప్రసంగాలపై కచ్చితమైన నిబంధనావళి లాంటిది చట్టపరంగా తీసుకురావాలేమో…
పుష్కరాల సమయంలో నదీజలంలోకి ముక్కోటి దేవతలు వచ్చి చేరతారనీ, అందుకే ఆ సమయంలో నదీ స్నానం చేస్తే పాపాలు కొట్టుకుపోతాయని చెప్పే మతపెద్దల తప్పు ఎంతో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత సాయంత్రం గరికపాటి, గార్గేయ వంటి ప్రవచన కర్తలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ , నదిలో ఎప్పుడు స్నానం చేసినా మంచిదేనని తేల్చిచెప్పారు. ముక్కోటి దేవతలు నదిలోకి వచ్చిచేరతారని ఎక్కడా హిందూ ధర్మశాస్త్రంలో చెప్పలేదనీ, ఎవరో కల్పించిన అభూతకల్పన వల్లనే ప్రజలు మూర్ఖంగా విశ్వసిస్తున్నారని గరికపాటి వారు ఈ సందర్బంగా చెప్పడం ఆలోచింపతగినదే. అయితే, ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందే తప్ప, ముందుగా ఇలాంటి ప్రచారం ఎందుకు చేయలేదన్నది అసలు ప్రశ్న. పుష్కర స్నానాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- మూఢనమ్మకాల వంటి విషయాలపై అటు ప్రభుత్వం కానీ, ఇటు మత ప్రచారకులు గానీ ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే మీడియాగానీ సరైన రీతిలో పట్టించుకోలేదు. దుర్ఘటన జరిగిన తర్వాత ఎదుటివారిదే తప్పన్నచందంలో మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు.
భక్తులు లేదా యాత్రికుల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడం తప్పేమీకాదు, కానీ వాటికి తమదైన వాక్పటిమతో షరతులు పెట్టి, కఠిన నియమాలను పులిమి చట్రంలో జనాల్ని గిరగిరా త్రిప్పితే ఇదిగో ఇలాగే ఉక్కిరిబిక్కిరితో త్రొక్కిసలాటకు గురయ్యే పరిస్థితులు దాపురిస్తాయి. పుష్కరుడు ఉదయం 6-21 గంటలకు వచ్చేస్తున్నాడన్న ఆధ్యాత్మిక వాదన యాత్రికుల్లో ఎంత బలంగా నాటుకుపోయిందంటే, `పుష్కరుడు వచ్చే సమయంలోనే స్నానం తప్పకుండా చేయాలి, లేకుంటే జన్మ వేస్ట్’ అన్నంత వరకు. చివరకు ఏమైందీ, ఈ మూర్ఖపు ఆలోచన ఎంతో మంది ఉసురు తీసిందో మనకు తెలుసు.
పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినప్పుడు తొక్కిసలాటలు జరగడం కొత్తేమీ కాదు. అలహాబాద్ లో 1954లో మహా కుంభమేళా జరిగినప్పుడు తొక్కిసలాటల్లో 800 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. 2011లో హరిద్వార్ లో తొక్కిసలాట జరిగినప్పుడు 22 మంది మరణించారు. ఇదే సంవత్సరంలో శబరిమలైలో తొక్కిసలాటకు 106మంది మృత్యువాత పాలయ్యారు. అలాగే 2008నాటి నైనాదేవి ఆలయ తొక్కిసలాట , 2010నాటి ప్రతాప్ ఘడ్ తొక్కిసలాట ఘటనలాంటివి ఈ సందర్భంగా గుర్తుకురాకమానవు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్ వద్ద కొండచరియలు విరిగిపడిన సంఘటన, క్రిందటిసారి కృష్ణానదికి పుష్కరాలు వచ్చినప్పుడు బండరాళ్లకింద చిక్కుకుని యాత్రికులు మరణించడం ఇలా ఎన్నో విషాదకర సంఘటనలు జరుగతున్నా, ఎప్పటికప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం అటు ప్రభుత్వాలకూ, ఇటు జనానికీ అలవాటుగా మారిపోయింది. `ఏమీ కాదన్న’ నిర్లక్ష్య ధోరణి మన దేశంలో తారా స్థాయికి చేరడం వల్లనే రోడ్డు ప్రమాదాలతో సహా అనేక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక సర్వే తేల్చిచెప్పింది.
మనకు చిటికలో పుణ్యం రావాలి. చేసిన పాపాలు ఒక్క మునకతో పోవాలి. అసలు ఈ ఆలోచనే తప్పు. దీనికి తోడు మత ప్రచారకులు పుష్కర నదీ స్నానం చేస్తే పాపాలు పోతాయంటూ జనంపై మాస్ హిప్నటైజ్ చేయడం తప్పోకాదో విజ్ఞులు తేల్చాలి. ఈ తరహా ప్రవచనాలు ఎటు దారితీస్తాయో చెప్పేవారు ఆలోచించరు, పాటించేవారూ అంతకంటే ఆలోచించరు. `ఎన్ని పాపాలైనా చేసినా ఫర్వాలేదు, పుష్కర స్నానం చేస్తే చాలు’ – అన్న ధీమా జనంలో పెరిగిపోతే చివరకు నైతిక విలువలు ఏ రకంగా పతనమవుతాయో ఆలోచించారా ? మత పరమైన ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానవాళిని క్రమపద్ధతిలో ఉంచడానికి దోహదకారికావాలేకానీ, ఇలా వారి ఉసురు తీయకూడదు. దుర్ఘటన జరిగిన తర్వాత తప్పుని ఎదుటివారిమీద త్రోసేయడం కాకుండా సమష్టి బాధ్యత వహిస్తూ మున్మందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి. అలాగే, మీడియాలో ప్రచారం బాగుందికదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడటం మత పెద్దలమనుకునేవారు మానేయాలి. లేకపోతే ప్రజలను మళ్ళీ అనాగరికులుగా మార్చేసిన పెను పాపం వారికి చుట్టుకుంటుంది.
– కణ్వస