బాక్సాఫీసు దగ్గర పరిస్థితులు మారిపోయాయి. సినిమాని విడుదల చేయాలంటే నిర్మాతలకు సవాలక్ష డౌట్లు. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, రారా? అనే మీమాంశ ఎక్కువైపోయింది. సోలోగా రిలీజ్ అయితేనే… థియేటర్లు నిండడం లేదు. అదే మరో సినిమాతో పోటీ పడితే, టికెట్లు తెగడం కష్టమే. ఈ దశలో ఆగస్టు 12న రెండు సినిమాలు ఒకేసారి ఢీ కొట్టుకోబోతున్నాయి. మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ 2 ఒకేసారి విడుదల కాబోతున్నాయి.
నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా `మాచర్ల నియోజకవర్గం`. ఇదో పొలిటికల్ యాక్షన్ డ్రామా. నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌పై తెరకెక్కింది. ఈమధ్య శ్రేష్ట్లో నితిన్ చేసిన సినిమాలన్నీ హిట్టే. మాస్, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. ముందు నుంచీ… నితిన్ టార్గెట్ ఆగస్టు 12నే. నిఖిల్ సినిమా `కార్తికేయ` అలా కాదు. చాలాసార్లు రిలీజ్ డేట్లు మార్చుకొంటూ వెళ్లింది. ముందు.. జులై 22 అన్నారు, ఆ తరవాత ఆగస్టు 5 అనుకొన్నారు. ఇప్పుడు 12కి వెళ్లారు. జులై 22న `థ్యాంక్యూ` వస్తోంది. అందుకే. కార్తికేయ తప్పుకొంది. 5న అయితే మరో రెండు సినిమాలు (సీతారామం, కార్తికేయ) ఉన్నాయి. వాటితో పోటీ పడడం ఇష్టం లేక.. 12కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడా నితిన్ కాచుకొని కూర్చున్నాడు. `కార్తికేయ 2`పై కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఆ సినిమాకీ సోలో రిలీజ్ అవసరం. కానీ ఆ అవకాశమే లేకుండా పోయింది.