మమతా బెనర్జీ రాజకీయ నిర్ణయాలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీల కూటమి తరపున తమ పార్టీ నేతనే నిలబెట్టారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గరకు వచ్చే సరికి ప్లేట్ ఫిరాయించారు. విపక్షాల తరపున అభ్యర్థిగా నిర్ణయించిన మార్గరేట్ అల్వాకు మద్దతిచ్చేందుకు నిరాకరించారు. అలా అని బీజేపీ అభ్యర్థికి అయిన తమ రాష్ట్ర గవర్నర్ ధన్కడ్కు మద్దతు ప్రకటించ లేదు. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
నిజానికి రాష్ట్రపతి అభ్యర్థి మీద మమతాకు ఎలాంటి వ్యతిరేక భావం ఉండక్కలేదు..కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై మాత్రం ఉండాలి. ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని జగ్దీప్ ధన్ ఖడ్ ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టారు. సమాంతర ప్రభుత్వం నడిపారు. కేంద్రం అండతో మమతా బెనర్జీ విషయంలో చాలా సార్లు దూకుడుగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయనపై మమతా ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో కూడా లెక్కలేదు. ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు.
అంతటి శత్రుత్వం ఉన్న ధన్కడ్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మమతా బెనర్జీ. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని డిసైడయ్యారు. గవర్నర్ బెంగాల్ నుంచి వెళ్లిపోతే చాలని ఇలా చేశారని కొంత మంది అంటున్నా.. అసలు మమతా విపక్షాలకు మద్దతిచ్చినా ధన్‌ఖడ్‌కు పోయేదేమీలేదని.. కానీ ఆయనపై వ్యతిరేకత చూపించినట్లు ఉండేదని అంటున్నారు. కానీ మమతా మాత్రం గైర్హాజర్ కావడం ద్వారా ధన్‌ఖడ్‌కు మేలు చేయాలని డిసైడయ్యారు.