బీజేపీపై విమర్సలు చేయడానికి ఎలాంటి చిన్న అవకాశం లభించినా వదులుకోని టీఆర్ఎస్కు ఈ సారి బీజేపీ గట్టి చాన్సే ఇచ్చింది. చాలా కాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంత కాలం ఎలాంటి సమాధానం చెప్పలేదు. హఠాత్తుగా ఇప్పుడు పార్లమెంట్లో మాత్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చేసింది. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయని అలాంటి ప్రమాణాలను కాళేశ్వరం అందుకోలేదని కేంద్రం తెలిపింది.
ప్రతి రాష్ట్రానికి ఓ జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ ప్రకటించడం సంప్రదాయం. కానీ తెలంగాణకు మాత్రం ఎలాంటి జాతీయ ప్రాజెక్టు పక్రకటించలేదు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాశారని కానీ.. ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు ఉంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఇవేమీ లేకుండా కేసీఆర్ రీ డిజైనింగ్ చేసి ప్రాజెక్ట్ నిర్మించారన్న అర్థంలో కేంద్రం ప్రకటించింది. అంటే ఓ రకంగా కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టని చెప్పినట్లయింది. దీంతో ఇక టీఆర్ఎస్ నేతలు … బీజేపీ తెలంగాణను అవమానించిందని.. రంగంలోకి దిగడమే తరువాయి. కాళేశ్వరం నీట మునిగిన అంశం కన్నా.. రెండు పార్టీల మధ్య ఈ అంశంపైనే వాదోపవాదుల జరిగే అవకాశం ఉంది.