భారత ప్రజాస్వామ్య గొప్పతనం మరోసారి ప్రపంచానికి తెలిసింది. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము దేశ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ఎంతో మంది తమ పార్టీలను కూడా కాదని ఆత్మప్రబోధానుసారం ఓటేశారు. రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆమెను అందరూ అభినందించారు. గిరిజనులు మాత్రమే కాదు భారతీయులందరూ స్వాగతించారు. వివాద రహిత వ్యక్తిత్వం ఆమెను ఉన్నత స్థానానానికి చేర్చింది.
చాలా మంది ఆమెను గిరిజన కోటాలో వేస్తున్నారు. గిరిజనులు మాత్రమే సంబరాలు చేసుకుంటున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఆమె గిరిజనానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధి ఆమె. అందుకే గిరిజన తెగకు చెందినందునే ఆమెకు అవకాశం వచ్చిందని చెప్పడం తప్పే అవుతుంది. అదే సమయలో గిరిజనులు మాత్రమే సంబరాలు చేసుకుంటున్నారనడం కూడా కరెక్ట్ కాదు.
దేశ ప్రజాస్వామ్యంలో ఎవరైనా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. దానికి కావాల్సింది దేశం పట్ల వారికి నిబద్ధత మాత్రమే. ఆ విషయం ద్రౌపది ముర్ముతో మరోసారి నిరూపితమైంది. ప్రజాస్వామ్యంలో ఎవరికీ వంద శాతం మద్దతు రాదు. గెలుపోటములు ఉంటాయి. అంత మాత్రాన ఎవరి విలువనూ తగ్గించి చూడలేం. భారత ప్రజాస్వామ్యంలో గొప్పదనం అదే. ప్రపంచదేశాల్లో ద్రౌపది ముర్ము భారత్ ఖ్యాతిని మరింతగా వ్యాప్తి చేస్తారు. అందులో సందేహం లేదు. భారత రాష్ట్రపతిగా ముర్ము ఉండటం… దేశానికి గౌరవం.