రాష్ట్రాలు వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభ ఆధారంగా ఇస్తున్న ర్యాంకుల్లో తెలంగాణ పైపైకి వెళ్తోంది. ఏపీ దిగువకు వెళ్లిపోతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో దిగజారిపోతోంది. ఇటీవల స్టార్టప్స్ ఎకోసిస్టం విషయంలో ఇచ్చిన ర్యాంకుల్లో దేశంలోనే అట్టడుగున ఉంది. తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. తాజాగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కూడా అదే పరిస్థితి. గతంలో ఉన్న మెరుగైన స్థానాలను ఏపీ పొగొట్టుకుంటే.. తెలంగాణ పైకి వెళ్తోంది.
సృజనాత్మకత, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, హ్యూమన్ ఇండెక్స్… వంటి ఆంశాల ఆధారంగా ఎంపిక చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అన్ని రంగాలను సగటున పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమ పనితీరు కనబర్చిన ‘బెస్ట్ పర్ఫార్మర్ స్టేట్’గా తెలంగాణకు మొదటి ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచింది. గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ మూడు స్థానాలు దిగజారిపోయింది.
కరోనా తర్వాత పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లోని ఆర్థిక, అభివృద్ధి, విద్య, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఎగుమతులు.. ఇలా పలు అంశాలపై నీతి ఆయోగ్, కాంపెటెటివ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తగా 2021 సంవత్సరానికి చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో స్టార్టప్‌ల సంఖ్య తొమ్మిది వేలకు పెరిగింది. కానీ ఏపీలో అందులో ఐదు శాతం కూడా లేవు. తెలంగాణలో వ్యాపారాభివృద్ధికి అనుకూల వాతావరణం ఎక్కువగా ఉంది. ఏపీలో అలాంటి పరిస్థితి లేదని నివేదిక తేల్చింది.