Thank You Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
నాగ చైతన్య, విక్రమ్ కుమార్ లది మ్యాజికల్ కాంబినేషన్. `మనం` లాంటి క్లాసిక్ అందించిన కాంబో ఇది. ఇప్పుడు ‘థాంక్యూ’ కోసం మరోసారి జట్టు కట్టారు. దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ కాంబో పవర్ మరింత పెరిగింది. విక్రమ్ కుమార్ సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన ముద్ర. దిల్ రాజు సినిమాకి కూడా ఒక స్పెషల్ బ్రాండ్ వుంది. ఇలాంటి రెండు స్పెషల్ బ్రాండ్ల కలయికలో వచ్చిన ‘థాంక్యూ’ ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేసింది? విక్రమ్ చేసిన మ్యాజిక్ ఏమిటి ? ట్రైలర్ లో కనిపించిన పాజిటివ్ వైబ్ సినిమాలో వర్క్ అవుట్ అయ్యిందా ? అసలు ఏమిటీ ‘థ్యాంక్యూ’ ..
అభిరామ్ (నాగ చైతన్య) సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్. రావు (ప్రకాష్ రాజ్) అమెరికాలో జాబ్ కన్సల్టెన్సీ నడుపుతుంటాడు. అభిరామ్, రావు కన్సల్టెన్సీ ద్వారానే ఉద్యోగం కోసం ఇండియా నుంచి అమెరికా వస్తాడు. అభిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి వస్తుంది ప్రియ(రాశి ఖన్నా) అభి కళ్ళల్లో ఆనందం, కల్మషం లేని చిరు నవ్వు తొలి చూపులోనే ప్రియకి నచ్చేస్తాయి. ఉద్యోగం కోసం అమెరికా వచ్చిన అభి.. వైద్య అనే స్మార్ట్ డయాగ్నొస్టిక్ యాప్ ని డెవలప్ చేయాలనే ఐడియా రావుకి చెప్తాడు. ఇలాంటి ఆలోచన వునప్పుడు ఉద్యోగం కోసం అమెరికా రావడం ఎందుకు ? ముందు మంచి ఉద్యోగం చూసుకో అని అభిని నిరాశ పరుస్తాడు రావు. అయితే అభికి యాప్ కి కావాల్సిన పెట్టుబడి ప్రియ ఇస్తుంది. యాప్ సూపర్ సక్సెస్ అవుతుంది. అభి ప్రియ లివిన్ రిలేషన్ షిప్ కూడా మొదలౌతుంది. యాప్ సక్సెస్ అవుతున్న క్రమంలో అభిలో అహంకారం పెరిగిపోతుంది. `మనం` అనే చోట `నేను` వచ్చి చేరుతుంది. తన విజయానికి కారణం తాను మాత్రమే అని గర్వం పెరిగిపోతుంది. అభిలోని ఈ మార్పు ప్రియని భాధిస్తుంది. ఇదే సమయంలో సాయం కోసం వచ్చిన రావుని గుమ్మం దగ్గరి నుంచే అవమానించి పంపించేస్తాడు అభి. ఆ సాయంత్రమే గుండెపోటుతో చనిపోతాడు రావు. దీంతో కృతజ్ఞత, మనస్సాక్షి లేని అభికి గుడ్ బాయ్ చెప్పి అతడి జీవితం నుండి బయటికి వచ్చేస్తుంది ప్రియ. తర్వాత ఏం జరిగింది ? అభిలో మార్పు వచ్చిందా ? అసలు అభి ఆ స్థాయికి రావడానికి కారణం ఎవరు ? అభి మనస్సాక్షి చెప్పిన గతం ఏమిటి ? ప్రియ మళ్ళీ అభి జీవితంలోకి వచ్చిందా ? అనేది మిగతా కథ.
చెప్పే పాయింట్ కొత్తది కానప్పుడు ట్రీట్మెంట్ కొత్తగా వుండాలి. పాత్రలని బలంగా మలచుకోవాలి. బోర్ కొట్టని స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కనీసం అనుకున్న పాయింట్ చుట్టూ సన్నివేశాల్ని నడపాలి. అప్పుడే ప్రేక్షకుడికి స్క్రీన్ తో కనెక్షన్ ఏర్పడుతుంది. అలా కాకుండా ఒక పాయింట్ ని ఎత్తుకొని ఆ పాయింట్ అక్కడే వదిలేసి పాయింట్ తో సంబంధం లేని సన్నివేశాలన్నీ తెరపై కనిపిస్తే ప్రేక్షకుడికి ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ వుండదు. థాంక్యూ విషయంలో ఇదే జరిగింది. పుట్టుకతో ఏ మనిషి అహంకారి, గర్విష్టి కాడు. అతని ఎదురైన పరిస్థితులే అతన్ని అలా మారుస్తాయి. ఇక్కడ అభిరామ్ పాత్ర అలాంటిందే. అయితే అలా మారడానికి ఎదురైన పరిస్థితులలో మాత్రం బలం లేదు. అభి గతానికి తనలో వచ్చిన మార్పుకి సంబంధం లేదు.
మొదటి సీన్ నుంచే కథ చెప్పడం విక్రమ్ స్టయిల్. థాంక్యూలో కూడా మొదటి సీన్ నుంచే కథని సీరియస్ టోన్ లో ఓపెన్ చేసి పది నిమిషాలు పరుగుపెట్టిస్తాడు. అభి అమెరికా రావడం, యాప్ ఐడియా చెప్పడం, అది సూపర్ సక్సెస్ అయిపోవడం చకచకా జరిగిపోతాయి. అయితే ఎక్కడైతే అభిలో అహంకారం ప్రవేశిస్తుందో .. అది కథలో చాలా కీలకమైన అంశం. కానీ దాన్ని చాలా బలవంతంగా ఇరికించినట్లు చూపించడం ఈ కథకి ప్రధాన మైనస్. ఎయిర్ పోర్ట్ బయట చక్రాల గుర్రం పై అమాయకంగా నవ్వుతూ తిరిగే అభి.. ఒక్కసారిగా అపరిచితుడులా క్యారెక్టర్ మార్చేసినట్లు వుంటుంది. పోనీ అతని గతంలో జరిగిన సంఘటనలు వలన అలా మారడంటే అదీ లేదు. అసలు ఆ గతంతో కథకి వచ్చిన బలం లేదు.
అభి గతంలోని నారాయణపురం, వైజాగ్ లో జరిగిన రెండు కథల్లో కూడా అతన్ని అహంకారిని చేసే పరిస్థితులు లేవు. ఆ రెండూ కూడా ఫీల్ గుడ్ కథలు గానే ట్రీట్ చేసి దర్శకుడు ఆ గతంలో వలనే అభిలో అంత స్వార్ధం పెరిగిపొయిందని చెప్పడంలో ఆసలు ఎమోషనల్ కనెక్షన్ లేదు. నారాయణపురం, వైజాగ్ లో జరిగిన రెండు కథల్లో కూడా హీరో లక్ష్యం హాకీ ప్లేయర్ కావడం. కానీ ఆ లక్ష్యాన్ని వదిలేసి హీరో అమెరికాలో సక్సెస్ అయిన వ్యక్తిగా గర్వపడం .. అర్ధరహితంగా వుంటుంది. హీరో క్యారెక్టర్ డిజైన్ లోని డొల్లతనం ఈ పాయింట్ దగ్గరే బయటపదిపోతుంది.
విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే కి చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. మామూలు పాయింట్ ని కూడా తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగల నేర్పు వున్న దర్శకుడు. అలాంటి మ్యాజిక్ ఏమైనా ఇందులో వుంటుందని ఆశించి థియేటర్లో అడుగుపెడితే మాత్రం మరింత నిరాశ తప్పదు. చాలా సాదాసీదాగా నడిచిపోయే పాయింట్ థాంక్యూ. ఎలాంటి మలుపులు, సర్ ప్రైజ్ లు లేకుండా, ఫ్లాట్ నేరేషన్ తో డల్ గా సాగుతుంది. అంతేకాదు మనస్సాక్షి అంటూ అభి నుంచి ఆత్మ బయటికి వచ్చి కథని ముందుకు నడపడం.. విక్రమ్ కుమార్ లాంటి స్క్రీన్ ప్లే మాస్టర్ చేయదగ్గ పని కాదు. విక్రమ్ సినిమాల్లో క్లైమాక్స్ కి కొంచెం సర్ప్రైజ్ వుంటుంది. కానీ ఇందులో మాత్రం ఇంటర్వెల్ బాంగ్ దగ్గరే క్లైమాక్స్ అర్ధమైపోతుంది.
నాగచైతన్యకి మూడు వేరియేషన్స్ లో కనిపించే అవకాశం ఇచ్చింది థాంక్యూ. నారాయణపురం కథలో సరిగ్గా మీసాలు కూడా రాని ఇంటర్ కుర్రాడి పాత్రలో, వైజాగ్ చదువుకున్న రోజుల్లో రగ్గడ్ లుక్ , అమెరికాలో పోష్ లుక్.. ఇలా మూడు కోణాలు చూపించాడు చైతు. ఇందులో మొదటి రెండు పాత్రలలో ప్రేమమ్, మజిలీ పాత్ర రిఫరెన్స్ గుర్తుకు వస్తుంది. అమెరికాలో అభిరామ్ పాత్రలో మాత్రం చైతుని చూడటం కొత్తగా వుంటుంది. దాదాపు సినిమా అంతా అలానే కనిపిస్తాడు. రాశిఖన్నా పాత్ర డీసెంట్ గా వుంది. ప్రియ పాత్రని హుందాగా చేసింది. పార్వతి పాత్ర చేసిన మాళవిక నాయర్ చాలా సహజంగా కనిపించింది. చిన్ను పాత్రలో కనిపించిన అవిక గొర్ ద్వారా సిస్టర్ సెంటిమెంట్ రాబట్టుకోవాలని చూశారు. అయితే అదంతా వర్క్ అవుట్ కాలేదు. సాయి సుశాంత్ పాత్ర రెగ్యులర్ గానే వుంది. ప్రకాష్ రాజ్ ది చిన్న పాత్రే అయిన తన అనుభవాన్ని చూపించారు. మిగతానటీనటులు పరిధి మేర చేశారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. చక్కటి ప్రొడక్షన్ చేశారు. పీసీ శ్రీరామ్ కెమరా పనితనం మరోసారి మాస్టర్ క్లాస్ అనిపించింది, తమన్ ఇచ్చిన సంగీతం బావున్నా .. ఈ కథకి మాత్రం అది అతకలేదు. నేపధ్య సంగీతం కూడా సోసో గానే వుంది. గుర్తుపెట్టుకునే డైలాగ్స్ లేవు. నవీన్ నూలీ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. సినిమా నిడివి తక్కువే. అయితే ఇలాంటి కథ షార్ఫ్ చెప్పాలనుకోవడం కూడా ఒక సవాల్. ఒక జీవితాన్ని చూపించాలనుకున్నపుడు మూడు లోకేషన్స్ గా డివైడ్ చేసి మ్యాజిక్ చేసేయలనుకోవడం కూడా సాహసమే.
నిజానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ ఎత్తుగడలోనే ఒక లోపం వుంది. థాంక్యూ అనేది ఒక ఎక్స్ ప్రెషన్. పగ, భయం, ప్రతీకారం, కోపం అనేవి ఎమోషన్స్. సినిమా కథ సరిపడా డ్రామా కావాలంటే ఎమోషన్స్ ని పట్టుకోవాలి. ఒక ఎమోషన్ ఇచ్చినంత డ్రామా ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు. ఒక ఎక్స్ ప్రెషన్ చుట్టూ డ్రామా నడపాలనే ఆలోచన కొత్తగానే వున్నా,.. దాన్ని డీల్ చేయడంలో తడబడిపోయారు విక్రమ్ కుమార్.
తెలుగు360 రేటింగ్ : 2.25/5