బీజేపీలో చేరాలని ఉబలాటపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీలోకి రావాలంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు. అనుచరులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటున్నారు.
గత ముందస్తు ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ నేతలతో మాట్లాడుకుని వచ్చారు. కార్యకర్తలతో భేటీ అయ్యారు.అయితే బీజేపీలో తానే పెద్ద నేతనని.. ముఖ్యమంత్రి అభ్యర్థినని ఆయన ప్రచారం చేసుకున్నారు . దీంతో బీజేపీ హైకమాండ్ ఆయనను దూరం పెట్టేసింది. అప్పట్నుంచి బీజేపీలో చేరుతా.. బీజేపీలో చేరుతా అంటున్నారు కానీ వారు చేర్చుకోవడం లేదు. ఇటీవల ఆయన తన ప్రయత్నాలను మరోసారి చేస్తున్నారు. ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ సాయంతో అమిత్ షాను కలిశారు. రాజగోపాల్ రెడ్డి తీరుపై ఆయనకు స్పష్టత ఉండటంతో ముందు రాజీనామా చేసి రమ్మని చెప్పి పంపేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. టీఆర్ఎస్ను ఓడించే పార్టీలోనే ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఆయనకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది. గెలిచినప్పటి నుండి పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ కూడా ఆదరించే పరిస్థితి లేదు. బీజేపీలో చేర్చుకోవడం లేదు. టీఆర్ఎస్ రానీయదు. దీంతో కోమటిరెడ్డి సోదరుడికి రాజకీయాల్లో దారి తెలియని పరిస్థితి ఏర్పడింది.