68వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి నాలుగు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `కలర్ ఫొటో` ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) పురస్కారం `అల వైకుంఠపురములో`కి గానూ తమన్ కి దక్కింది. చిన్న సినిమాగా విడుదలైన `నాట్యం` రెండు అవార్డుల్ని ఎగరేసుకుపోయింది. ఉత్తమ కొరియోగ్రఫీ (సంధ్యారాజు) ఉత్తమ మేకప్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. ఎప్పటిలానే తమిళ, మలయాళ చిత్రాలు ఈసారి ఎక్కువ అవార్డుల్ని అందుకొన్నాయి. ఉత్తమ నటుడిగా సూర్య (సూరారై పోట్రు – తెలుగులో ఆకాశమే నీ హద్దురా) దక్కించుకొన్నాడు. ఈ అవార్డుని ఈసారి అజయ్ దేవగణ్ (తానాజీ)తో పంచుకోనున్నారు. ఉత్తమ నటి (అపర్ణ), ఉత్తమ చిత్రం అవార్డుల్ని సైతం సూరారై పోట్రు దక్కించుకొంది. మలయాళ చిత్రం అయ్యప్పయునుమ్ కోషియమ్ కీ బాగానే అవార్డులు వచ్చాయి. ఉత్తమ సహాయ నటుడుగా బీజూ మీనన్ ఎంపికయ్యారు.