గడప గడపకూ వెళ్లకపోతే టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతున్నా చాలా మంది ఎమ్మెల్యేలు కదలడం లేదు. ఓ పది.. పదిహేను మంది తప్ప అందరూ తూ తూ మంత్రంగా చేస్తున్నారని జగన్కు అర్థమైంది. దీంతో ఆయన ఎలాగైనా ఎమ్మెల్యేల్ని గడప గడపకూ తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి జిల్లాల అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల పదవులు పోగొట్టుకున్న మాజీ మంత్రులే. ఎమ్మెల్యేలతో ప్రోగాంను సక్సెస్ చేయించాల్సింది మీరేనని వారికి జగన్ తేల్చి చెప్పారు. మీకు ఐ ప్యాక్ టీం సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. ఐ ప్యాక్ టీంలు జిల్లాల వారీగా పని చేస్తాయని వారితో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అసలు బాధ్యతంతా జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదేనని జగన్ తేల్చేశారు. మరి మంత్రులేం చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. మంత్రులకేం బాధ్యత ఉండదా.. పదవులు పీకేసి బాధ్యతలు ఇవ్వడం ఏమిటని వారు గొణుక్కుంటున్నారు. పార్టీలో ఉండే సమస్యలు.. ఆధిపత్య పోరాటంచాలా ఉన్నాయని అలాంటి సమస్యలు ఎన్నో ఉంటే .. తమ మాటలు ఎమ్మెల్యేలు ఎలా వింటారని వారు మథనపడుతున్నారు. పనిలో పనిగా తాము కూడా కార్యక్రమం చేపట్టాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు.
కారణం ఏదైనా కానీ.. గడప గడపకూ ఎమ్మెల్యేల్ని పంపి ప్రభుత్వంపై కోపం ఏదైనా ఉంటే వారిని తిట్టడం ద్వారా శాంతిప చేయాలని జగన్ అనుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఈ మూడున్నరేళ్ల కాలంలో చిన్న పని చేయలేకపోయారని.. సంక్షేమ పథకాల గురించి చెబుతూ ఎన్ని ఇళ్లు తిరగాలని వారు మథనపడుతున్నారు. జగన్ తాపత్రయమేకానీ.. జిల్లాల అధ్యక్షులు కూడా అంత సీరియస్గా తీసుకోవడం లేదన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.