బాహుబలితో పాన్ ఇండియా మార్క్ తెచ్చుకున్న ఆర్కా మీడియా ఎప్పటినుండో టెలివిజన్ ప్రొడక్షన్ లో వుంది. ఈటీవీతో కలసి తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లో పలు సీరియల్స్ ని ప్రొడ్యుస్ చేసింది. ఇప్పుడు వెబ్ కంటెంట్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణంలో హాట్ స్టార్ లో విడుదలైన ‘పరంపర’ వెబ్ సిరిస్ కి మంచి పేరొచ్చింది. మంచి నిర్మాణ విలువతో తెలుగులో వచ్చిన తొలి సిరిస్గా ప్రశంసలు అందుకుంది. కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల ఈ వెబ్ సిరిస్ కి దర్శకులు. కథ, పాత్రలని బలంగా తీర్చిదిద్దారు. ఏడు ఎపిసోడ్లు గల సీజన్ వన్ ఫ్యామిలీ పొలిటికల్ పవర్ డ్రామా గా ఆకట్టుకుంది. ఇప్పుడు పరంపర సీజన్ 2 విడుదలైయింది. సెకండ్ సీజన్ లో మొత్తం ఐదు ఎపిసోడ్లు వున్నాయి. ఒకసారి కథని రివైండ్ చేసుకుంటే…
వీరనాయుడు (మురళీమోహన్) ప్రజా నాయకుడు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయం చేస్తుంటాడు. ప్రజల మేలు కోసం తన సొంత భూమిని కూడా దానం చేసిన ఉత్తముడు. వీరనాయుడు కొడుకులు మోహన రావు (జగపతిబాబు) నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్). అయితే అనాథ అయిన మోహన రావును వీరనాయుడు దత్తతు తీసుకుని పెద్ద కొడుకు హోదా ఇస్తాడు. మోహన్ రావుని తన రాజకీయ వారసుడిని చేయాలి వీరనాయుడు భావిస్తాడు. అంతలోనే వీర నాయుడి హత్య జరుగుతుంది. నాగేంద్ర నాయుడు, మోహనరావుని రాజకీయాలకు దూరం పెడతాడు. తండ్రి వీరనాయడు స్థానంలో నాగేంద్ర నాయడు చలామణి అవుతాడు. పవర్ మొత్తం తన చేతిలోకి తీసుకుంటాడు నాగేంద్ర. అయితే మోహన్ రావుకి మాత్రం తమ్ముడిపై ఎలాంటి ద్వేషం వుండదు. ఒక నిజాయితీ గల అన్నగా తమ్ముడు నాగేంద్రకి నీడలా వెంటవుంటాడు. ఐతే తన తండ్రి మోహన్ రావుని బాబాయ్ పక్కన పెట్టేయడాన్ని మోహనరావు కొడుకు గోపీ (నవీనచంద్ర) జీర్ణించుకోలేకపోతాడు. వీర నాయుడి స్థానంలో ఉండాల్సిన తన తండ్రిని నగేంద్ర తోక్కేయడంతో గోపి రగిలిపోతుంటాడు. ఎలాగైనా తన తండ్రికి వీర నాయుడి స్థానం దక్కాలని బాబాయ్ నగేంద్రతో వార్ మొదలుపెతాడు. మరో పక్క నాగేంద్ర కొడుకు సురేష్ (ఇషాన్) రూపంలో కూడా గోపికి శత్రుత్వం ఏర్పడుతుంది. ఈ క్రమంలో అనేక మలుపులు, ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. గోపి ప్రాణంగా ప్రేమించిన అర్చన (ఆకాంక్ష సింగ్) అతనికి దూరమౌతుంది. తన పవర్ గేమ్ తో గోపిని జైలుకి పంపిస్తారు నాగేంద్ర, సురేష్. జైలు నుండి బయటికి వచ్చిన గోపి, నాగేంద్రపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ? నరేంద్ర నుండి పవర్ ని లాక్కోవడానికి గోపి ఆడిన పవర్ గేమ్ ఏమిటి ? ఈ పవర్ గేమ్ లో విజేత ఎవరు ? అనేది మిగతా కథ.
సెకండ్ సీజన్ లో గమనం, క్రియ, స్థానం, చతురంగం, మూల్యం అని ఐదు ఎపిసోడ్లు వున్నాయి. సీజన్ వన్ లో ప్రతి ఎపిసోడ్ లో కి ఒక మలుపు, సర్ ప్రైజ్, ఎమోషనల్ జర్నీని చక్కగా ప్లాన్ చేశారు. ముగింపు సన్నివేషాన్ని మొదట్లో చూపించి గోపి, నాగేంద్ర పాత్రల మధ్య సంఘర్షణని ఉత్కంఠగా మలిచారు. అయితే సెకండ్ సీజన్ లో చూపించిన ఐదు ఎపిసోడ్లలో మొదటి నాలుగు ఎపిసోడ్లు అంత ప్రభావంతంగా వుండవు. సెకండ్ సీజన్ లో చూపించాల్సిన కథని మొత్తం చివరి ఎపిసోడ్ ‘మూల్యం’కి పరిమితం చేశాం. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది.
గోపి జైలు జీవితం, అక్కడ గొడవలు, కొత్తగా ఏర్పడిన స్నేహితులతో మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. గోపి ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎన్నికల కోసం ఒక మిషన్ ని ప్లాన్ చేస్తాడు. భానుమతి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కోసం సెకండ్ ఎపిసోడ్ ని కేటాయించారు. ‘స్థానం’ ఎపిసోడ్ లో నాగేంద్ర నిజస్వరూపం చూపించిన విధానం బావుంటుంది. మోహన్ రావుకి నాగేంద్ర ఇచ్చే స్థానం అతడిలో క్రూరత్వాన్ని బయటపెడుతుంది, చతురంగం ఎపిసోడ్ లో నాగేంద్రపై గోపి పై చేయి సాధిస్తాడు. నాగేంద్రకు తిరస్కరించలేని ఆఫర్ ని ఇచ్చే క్రమంలో వచ్చే సన్నీవేషాలు ఆసక్తికరంగా వుంటాయి.
సెకెండ్ సీజన్ కి మెయిన్ హైలెట్ చివరి ఎపిసోడ్ మూల్యం. అప్పటివరకూ మాములుగా జరుగుతున్న డ్రామాని మరోస్థాయికి తీసుకెళ్ళింది ఫైనల్ ఎపిసోడ్. నాగేంద్ర బాక్సయిట్ మాఫియా, గోపి తల్లి ఎన్నికల్లో పోటి చేయడం, మోహన్ రావుకి నాగేంద్ర నిజస్వరూపం తెలియడం, వదినని కూడా చంపడానికి వెనుకాడని నాగేంద్ర రాక్షసత్వం.. ఇలాంటి ప్రధాన ఘట్టాలన్నీ ఫైనల్ ఎపిసోడ్ లోనే వున్నాయి. మూడో సీజన్ పై ఆసక్తిని పెంచిన ఎపిసోడ్ ఇది. తొలి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ వేగం తక్కువ. కేవల ఐదు ఎపిసోడ్లు సీజన్ ని రిలీజ్ చేయడం ఒక్కింత నిరాశ. ఐతే సెకండ్ సీజన్ కి ఇచ్చిన ముగింపు మాత్రం బావుంది. మోహన్ రావు పాత్ర వైలెంట్ అయితే ఎలా వుంటుందో తర్వాత సీజన్ చూస్తారని చెప్పకనే చెప్పారు. నాగేంద్ర పాత్రపై వేసిన చివరి షాట్.. సీజన్ 3 మోహన్ రావు వెర్సస్ నాగేంద్రగా ఉంటుందని హింట్ ఇచ్చింది.
నాగేంద్ర నాయడు పాత్రలో శరత్ కుమార్ మరోసారి ఒదిగిపోయారు. అహంకారం, అధికార కాంక్ష, తన స్వార్ధం కోసం ఎంతటికైన తెగించే వ్యక్తిగా శరత్ కుమార్ చాలా సహజంగా నటించారు. జగపతి బాబు లాంటి పవర్ ఫుల్ నటుడిని తీసుకొని అతనికి మరీ ఒకేమూసలో నడిచే పాత్ర ఇచ్చారేంటి ? అని అనుమానం కలిగింది సీజన్ వన్ చూస్తున్నా ప్రేక్షకులకు. అయితే రెండో సీజన్ చివర్లో మోహన్ రావులో మరో యాంగిల్ కూడా వుందని చెప్పడం ఆసక్తికరంగా వుంది. గోపిగా నవీన్ చంద్ర చాలా సెటిల్ద్ గా చేశాడు. అతడి పాత్రలో మరింత పరిణితి కనిపించింది. చంపడం కాదు నాగేంద్రని ఓడించడమే లక్ష్యంతో సాగిన గోపి పాత్ర మంచి గ్రాఫ్ లో నడిచింది. ఆకాంక్ష సింగ్, ఇషాన్, నైనా గంగూలీ పాత్రలకు ఈ సీజన్ లో నిడివి తక్కువే. ఆమని పాత్రని ముగించిన విధానం సీజన్ కి ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చింది. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.
ప్రొడక్షన్ డిజైన్ చాలా బావుంది. కెమరా పనితనం, నేపధ్య సంగీతం, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. ఐదు ఎపిసోడ్లు వున్న సెకెండ్ సీజన్ పరంపర మూడో సీజన్ పై ఆసక్తిని పెంచడంలో విజయం సాధించింది.