కేటీఆర్‌కు కాలం కలసి వస్తున్నట్లుగా లేదు. పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు ఆయన జారి పడటంతో కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నడవడం కష్టం కాబట్టి కేటీఆర్ అధికార విధులకు దూరమని అనుకోవచ్చు. అయితే వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన చేయాలనుకున్న పనులు చేస్తారు. ప్రత్యక్షంగా పాల్గొనాలనుకున్న పనులు మాత్రం వాయిదా పడతాయి.
కాలుకి గాయంపై కేటీఆర్ స్పోర్టివ్‌గా స్పందించారు. మంచి ఓటీటీ షోలను సూచించాలని ఆయన తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేసి ఫోటో కూడా పెట్టారు. ఆదివారం కేటీఆర్ పుట్టిన రోజు . ఆయన పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా భారీగా సెలబ్రేట్ చేయాలని క్యాడర్ అనుకున్నారు. అయితే వరదలు ముంచుకు రావడంతో అలాంటి పుట్టిన రోజులేమీ వద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉదయమే ట్వీట్ చేశారు.
అయితే కాసేపటికే ఆయన గాయపడినట్లుగా తేలింది. రాజకీయంగా ఇటీవలి కాలంలో బీజేపీపై ఎటాక్ చేయడంలో కేటీఆర్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అయినా పోయేదేమీలేదు.. ట్విట్టర్ ద్వారా తన పోరాటం తాను చేస్తారు. కేటీఆర్ వేగంగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్.. టీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తున్నారు.