తెలంగాణ సీఎం కేసీఆర్ ఖర్చు లేని ప్రజల కోరికను తీర్చేందుకు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎక్కడైనా మండలాలు కోరుకుంటున్నారని తెలిస్తే అక్కడ మండలాలను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో పదమూడు మండలాలను ప్రకటించారు. ఇవన్నీ ప్రజల్లో కొంత కాలంగా ఉన్న డిమాండ్లే. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి.
వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా పదమూడు మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయంతీసుకుంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఆ తర్వాత మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇలా వరుసగా ఎక్కడైనా మండలాల డిమాండ్ వస్తే తీర్చేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు చాలా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేసీఆర్ ఇలాంటి విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
మరిన్ని మండలాల డిమాండ్లు ఉన్న పరిష్కరించేందుకు రెడీగా ఉంటారు. నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ప్రకారం తక్షణం మండలాలు ఉనికిలోకివస్తాయి. ఆయా మండలాల్లో టీఆర్ఎస్కు ఆ పార్టీ అధినేతకు.. పాలాభిషేకాలు మామూలే.