జగన్మోహన్ రెడ్డి తనను టార్గెట్ చేసుకోవడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ.. అంతకు మించి తనకు చాన్స్ రాదనుకుంటున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని స్వయంగా ప్రచారం మొదలు పెట్టేశారు. ప్రతీ వారాంతంలో తాను రాసే “కొత్త పలుకు” ఆర్టికల్‌లో ఈ వారం జగన్మోహన్ రెడ్డి ఎలా పతనమయ్యారో విశ్లేషించేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా అందుకే నేరుగా రంగంలోకి దిగలేని.. జగన్‌కు ఈ సారి అవకాశాల్లేవని ఆయన తెలంగాణ కు చెందిన ప్రముఖ రాజకీయనేతకు చెప్పారని అంటున్నారు. పీకే ఏ రాజకీయ నేతతోనూ మాట్లాడలేదు. ఒక్క కేసీఆర్‌తో తప్ప. ఆయనతో మాత్రమే సమావేశమై వెళ్లిపోతున్నారు. మరి కేసీఆరే.. ఆర్కేకి ఆ మాట చెప్పారేమో కానీ… తాన చెప్పే జగన్ పనైపోయిందనే పలుకులకు. .. ప్రశాంత్ కిషోర్ అనే ఓ నమ్మకాన్ని తగిలించుకునే ప్రయత్నం చేశారు.
ఇప్పటికిప్పుడు మారిపోయినా.. పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డికి చాన్స్ లేదనేది ఆర్కే వాదన. ఎన్నికలకు ఇంకా ఇరవై నెలలకుపైగా సమయం ఉంది. అయినప్పటికీ.., జగన్ పనైపోయిందన్నట్లుగా ఆర్కే పలుకు రాయడం ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు కూడా కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్ విషయంలో ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్న ఓ భావన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆర్కే పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించడం సహజమే.
కేంద్రం నుంచి ఇక అప్పులు పుట్టవని ఆర్కే చెబుతున్నారు. అందుకే మీట నొక్కుడు పథకాలకు డబ్బులు అందవని.. ఇది ప్రజల్లో తిరుగుబాటు తెస్తుందని తన ఆర్టికల్‌లో ఆశపడ్డారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున నిధుల బదిలీ చేయడానికి ఎన్ని రకాలుగా నిధుల సేకరణ జరిపారో అందరికీ ఆశ్చర్యమే. చంద్రబాబు కూడా తాను చాలా నేర్చుకున్నానని చాలా సార్లు చెప్పారు. మద్యం ధరలు పెంచడమో.. పన్నులు వసూలు చేయడమో.. ఆస్తులు తాకట్టు పెట్టడమో.. అమ్మడమో మాత్రమే కాదు ఎవరూ ఊహించని విధంగా అప్పులు తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకున్నారు., ఆర్బీఐ దగ్గర కావాల్సినంత అప్పు పుట్టించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. చేతులెత్తేస్తారని ఆర్కే ఎందుకు అనుకుంటున్నారో మరి !
తెలంగాణ రాజకీయాలపై కేసీఆర్ చేసిన విశ్లేషణ కూడా కాస్త తేడాగానే ఉంది. బీజేపీని నిలువరించాలంటే.. మళ్లీ కాంగ్రెస్ బలపడేలా సహకరించాలని ఆయన అనుకుంటున్నారట. కేసీఆర్ సహకారంతోనే కాంగ్రెస్‌లో చేరికలని కూడా ఆర్కే చెబుతున్నారు. తమ పార్టీ నేతల్ని ఇతర పార్టీలోకి పంపించి బలపరిచేంత రాజకీయం కేసీఆర్ చేస్తారా ?పార్టీలో ప్రాధాన్యం దక్క.. చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. అయితే బీజేపీకి లేనిపోని ప్రయారిటీ ఇచ్చేందుకన్నట్లుగా రాజగోపాపల్ రెడ్డి రాజీనామా చేసి మునుగోడులో ఉపఎన్నిక వస్తే బీజేపీ గెలుస్తుందన్నట్లుగా రాసుకొచ్చారు. మొత్తానికి ఆర్కేకు ప్రతీ వారం.. రెండు రాష్ట్రాల్లో రెండు భిన్నమైన అజెండాలతో పలుకుల్ని వినిపించాల్సి వస్తోంది. ఏపీలో స్పష్టత కనిపిస్తోంది కానీ.. తెలంగాణలో ఆయనకూ గందరగోళంగానే ఉన్నట్లుగా కొత్త పలుకు చెబుతోంది.