మొదట రేవంత్ రెడ్డి.. ఆ తరువాత వరుసగా సెబాస్టియన్, ఉదయ్ సింహ, సండ్ర, వేం నరేందర్ రెడ్డిలకు ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో నోటీసులు జారీ చేసారు. వారిలో ఒక్కవేం నరేందర్ రెడ్డిని తప్ప మిగిలిన వారినందరినీ జైలుకి కూడా పంపారు. ఇప్పుడు తాజాగా వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ కి నోటీసులు జారీ చేసారు. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కృష్ణని రేపటి లోగా తమ ముందు హాజరు కమ్మని ఆదేశిస్తూ నోటీసు జారీచేసారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందా లేదా అనే విషయం విచారణలో తేలవచ్చును. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న అతనికి నోటీసులు జారీ చేయడం ద్వారా అతని ఉద్యోగంపై, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని ఎవరయినా తేలికగానే ఊహించవచ్చును. కనుక సహజంగానే వేం నరేందర్ రెడ్డి కుటుంబం కూడా దీని వలన తీవ్ర ఒత్తిడికి గురికావచ్చును. బహుశః ఈ నోటీసు పంపడం వెనుక అసలు ఉద్దేశ్యం కూడా అదే అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
వేం నరేందర్ రెడ్డిని ఇదివరకు ఎసిబి అధికారులు ప్రశ్నించినప్పటికీ ఆయన వారడిగిన అన్ని ప్రశ్నలకు చాలా నిబ్బరంగా సమాధానాలు చెప్పినట్లు వార్తలు వచ్చేయి. కనుక ఈవిధంగా ఆయనని ఒత్తిడికి గురిచేసినట్లయితే తెరాసవైపు ఆకర్షించవచ్చనే ఆలోచనతోనే ఆయన కుమారుడికి నోటీసులు పంపి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అదే నిజమయితే తెలంగాణాలో మిగిలిన తెదేపా నేతలను లొంగదీసుకోవడానికి తెరాస ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగిస్తుందేమో? ఓటుకి నోటు కేసులో తెరాస ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేకపోయినా ఈవిధంగా ఆయన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తూ వారిని తెరసలోకి ఆకర్షించాలని ప్రయత్నిస్తోందేమో? రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.