రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు కామనే కానీ.. ఒక్కో సారి ఇవి రాజకీయానికి సంబంధించి అయి ఉండవు. సోషల్ కాజ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వినిపించే చాలెంజ్‌లు అలాంటివే. తాజాగా చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని చాలెంజ్ చేశారు. తన చాలెంజ్‌కు ముగ్గుర్ని నామినేట్ చేశారు. అందులో ఒకరు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కూడా వెంటనే.. కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించి చేనేత దుస్తులు ధరించి ఫోటోలు పోస్ట్ చేశారు.
తాను కూడా ముగ్గురికి చాలెంజ్ చేశారు. అందులో ఒకరు చంద్రబాబునాయుడు. ఆయనతో పాటు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. తెలంగాణ బీజేపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఇద్దరు. ఈ ముగ్గురూ స్పందిస్తారో లేదో క్లారిటీ లేదు. అయితే పవన్ కల్యాణ్ .. చంద్రబాబుకు చాలెంజ్ చేయడం కాస్త ఆసక్తి కరమే. చంద్రబాబు ధరించే దుస్తులు సహజంగా చేనేతవే అయి ఉంటాయి. రాజకీయ నాయకులు ఎక్కువగా చేనేత దుస్తులే వాడతారు.
తాను ధరించేవి చేనేతే అని చంద్రబాబు పవన్ సవాల్ స్వీకరిస్తారో లేదో తెలియదు కానీ.. అలా స్పందిస్తే మాత్రం .. రాజకీయంగా కుచ్ కుచ్ హోదా హై అనే చర్చలు మాత్రం ప్రారంభమవుతాయి. ఈ రాజకీయాల సంగతేమైనా కానీ ఇలా చేనేతలకు ఆదరణ లభిస్తే.. అ వర్గానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఈ చాలెంజ్‌ను రాజకీయ దృష్టితో చూడకుండా.. సామాజిక దృష్టితో చూస్తే.. ఫీల్ గుడ్ భావన వస్తుంది.