దేశంలో ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీ ఢీకొట్టే లీడర్ లేడు. ఆయనకు త్రివిధ దళాలుగా చెప్పుకునే సీబీఐ, ఐటీ, ఈడీ ఉంటే ఉండవచ్చుగాక. అవి మాత్రమే కాదు ఎన్ని పన్నులు బాదేస్తున్నా.. పాలన బాగోలేదని గగ్గోలు పెట్టే వారున్నా.. ప్రజల్లో ఆయన పలుకుబడి తగ్గడం లేదు. దానికి కారణాలేమిటన్నదాని సంగతి పక్కన పెడితే .. ఈ కారణంగానే ఆయన పై పోరాటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోరాడిన వారంతా ఓడిపోయి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్నా.. కేసీఆర్ మాత్రం సై అంటున్నారు.
మమతా బెనర్జీ కూడా అలసి పోయారు .. కానీ కేసీఆర్ !
బీజేపీపై పోరాటంలో మమతా బెనర్జీ కూడా అలసిపోయారు. సొంత కేబినెట్ మంత్రి పార్థచటర్జీని ఈడీ పట్టేసుకున్న తర్వాత ఆమె సైలెంట్‌గా ఉండటమే కాదు నేరుగా ఢిల్లీ వెళ్లి మోదీతో బేటీ అయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. తానిక జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టబోనని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే మోడీపై పోరాడిన వారిలో మొదటి వ్యక్తి అనే పేరున్న మమతా కూడా రాజీపడిపోయారు.
దేశంలో ఇప్పుడు మోడీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీ నేత లేడు !
మోదీతో తలపడేందుకు ఇప్పుడు ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ నేత కూడా సిద్ధంగా లేడు. మమతా దగ్గర్నుంచి స్టాలిన్ వరకూ.. చంద్రబాబు నుంచి ఫరూక్ అబ్దుల్లా వరకూ అందరూ అలసిపోయారు. తమ తమ రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకుంటే చాలనుకుంటున్నారు. మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలు చూసిన తర్వాత మరింత వణికిపోతున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో సోనియా, రాహుల్ తప్ప మరో ప్రత్యర్థి మోదీకి లేడు.
కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎందుకు కేసీఆర్ సాహసం చేస్తున్నారు ?
ఇలాంటి పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా కేసీఆర్ సాహసం చేస్తున్నారు. ఆయనకు ఎదురు పడకపోయినా.. సాఫ్ట్‌గా అయితే ఉండటం లేదు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయన్న ఆందోళనతో అలా చేస్తున్నారో లేకపోతే నిజంగానే అలాంటి సూచనలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటికైతే ఆయనపై ఎలాంటికేసులు లేవు. కానీ మోదీతో అనవసర ఘర్షణ పడటం వల్ల వాటిని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కేసీఆర్ ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారని అంతుబట్టని విషయం.
బీజేపీతో సంబంధాలు తెంచుకున్నది ఆయనే. గతంలో జగన్ కన్నా దగ్గరి సంబంధాలు బీజేపీ పెద్దలతో ఉండేవి. ఎంతగా అంటే.. వారు సహకరించకపోతే గతంలో ముందస్తుకు వెళ్లేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసి కూడా .. పట్టుదలకు పోతున్నారు. ఆయనకు రాజకీయం అంతా తెలుసు కదా అని చాలా మంది అనుకుంటారు.. కానీ లేనిపోని శత్రుత్వం పెంచుకోవడం రాజకీయమనిపించుకోదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.