రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదట్లో ఆయనను పార్టీ నేతలు బయటకు రానిచ్చేవారు కాదు. కనీసం అభిప్రాయాలు చెప్పడానికి ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం లభించేది కాదు. ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీని కాంగ్రెస్ నేతలు తొక్కి పడేశారు . ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు ఉంటున్నారు.. సొంత పార్టీ పెట్టుకుంటే.. బలమైన ప్రాంతీయ పార్టీని నడుపుకోగలరు కదా అని ఎక్కువ మంది అభిప్రాయపడేవాళ్లు. కానీ రేవంత్ సహనంతో ఉన్నారు. ఆయన ఆషామాషీ రాజకీయ నాయకుడు కాదు. అందుకే అవకాశం వచ్చే వరకూ చూశారు.
ఏ గ్రూపులు లేని కాంగ్రెస్ వచ్చేస్తోంది !
టీ పీసీసీచీఫ్ గా పదవి రాకుండా చేయడానికి చాలా జరిగాయి. వచ్చిన తర్వాత కూడా ఆయనను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఓ రకంగా అవన్నీ ఆయనకు మంచే చేస్తున్నాయి. టీ కాంగ్రెస్ అంటే గ్రూపులు. ఇప్పుడు గ్రూపులన్నీ బయటకు వెళ్లిపోయి.. అంతా రేవంత్ వర్గమే.. అంటే కాంగ్రెస్ వర్గమే అన్నట్లుగా ఉంటుంది. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంటుంది. విజయం కోసం పోరాడతారు. పోయేవాళ్లు పోతారు.
రేవంత్ రెడ్డికి ఇప్పుడే అసలైన చాన్స్ !
ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలైన చాన్స్ వచ్చింది. కేసీఆర్‌కు ధీటైన నేత రేవంతేనని ఎక్కువ మంది అభిప్రాయం. అందులో సందేహం లేదు. కానీ ఆయనకు ఏ ఒక్కటీ కలసి రావడం లేదు. దూకుడు కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నారు. అయితే ఆ దూకుడే లేకపోతే ఆయనను ప్రజల్లో ఈ ఇమేజ్ వచ్చేది కాదు. అందుకే ఆయన రాజకీయం ఎలాంటిదైనా గెలుపుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీ పడటం లేదు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బలంగానే పోరాడుతోంది.
ఇదే చివరి చాన్స్ కూడా !
అయితే రేవంత్‌కు ఇది చివరి చాన్స్. గ్రామ గ్రామాన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ ఆయన చేతిలో ఉంది. భారంగా మారిన సీనియర్లు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలాన్ని ఉపయోగించుకుని .. తన వ్యూహాలతో .. పార్టీని అధికారంలోకి తేవాలి. అలా తెస్తే రేవంత్ తెలంగాణలో కేసీఆర్ కన్నా బలమైన నాయకుడు అవుతాడు. చాన్స్ మిస్ చేసుకుంటే ఆయన తన లక్ష్యాన్ని చేరకుండా .. పోరాడి ఓడిన వీరుడిగా చరిత్రలో మిగిలిపోతాడు.