నేను ఏ పార్టీలో ఉంటానో తెలియదంటూ కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఎమ్మెల్యే అనే హోదానే కానీ కనీసం ఓ పించన్ కూడా మంజూరు చేయించలేనంత దుర్భర స్థితికి పడిపోయిన పరపతికి చాలా మంది కుళ్లిపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పరంగా పనులు చేసినా బిల్లులు రాకపోవడం.. తమ మాటలను చిన్న చిన్న అధికారులు కూడా పట్టించుకోకపోతూండటంతో వారంతా నిర్వేదంలో ఉన్నారు. అందుకే ఏదో ఓ పార్టీ అంటూ నిరాశలోకి వెళ్లిపోతున్నారు.
వైసీపీలో విధేయత చూపించడమే ప్రధాన అర్హత. జగన్ ను ఎంత పొగుడుతారో అంతకు రెండింతలు ఇతర పార్టీల నేతల్ని తిట్టాలి. బండబూతులు తిడితే అదనపు విధేయత చూపించినట్లు. అయితే చాలా మంది ఈ రాజకీయాలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇతరుల్ని శత్రువుల్ని చేసుకుని తాత్కలిక లాభం పొందుతాం కానీ తర్వాత తమ పరిస్థితేమిటని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదు. చివరికి సర్వేల పేరుతో వారికి పొగ పెడుతున్నారు. అవసరంలో వారికి పిలిచి మరీ టిక్కెట్లిచ్చినా వదిలించుకుటున్నారు.
వైసీపీలో కనీసం అరవై మంది ఎమ్మెల్యేలు నోరు తెరవడం లేదు. ఇతర పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటున్నారు. ఏమైనా తేడా వస్తే తమను టార్గెట్ చేయకుండా వారు ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో జగన్ చెబుతున్న సర్వేలు.. ఇతర మార్గాలు.. తమతో జగన్ మాట్లాడేటప్పుడు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి.. తమకు టిక్కెట్ రాదనుకుంటున్న వారు.. కూడా ఏదో పార్టీ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని పార్టీ అధినేత జగనే సృష్టిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అది వ్యూహమా ? లేక నైజమా ? అన్నది ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.