ఓ సినిమాని సినిమావాళ్లో, సినీ విశ్లేషకులో, ట్రేడ్ పండితులో మెచ్చుకుంటే సరిపోవడం లేదు. సోషల్ మీడియాలోనూ పాజిటీవ్ రివ్యూ రావాల్సిందే. ఎందుకంటే… సోషల్ మీడియా ప్రభావమే జనాలపై ఎక్కువగా పడుతోంది. వాళ్లకా… ఏ సినిమా పూర్తిస్థాయిలో నచ్చదు. అన్ని కోణాల్లోనూ సినిమానీ పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. సినిమా తేడా కొట్టిందా – మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. చిన్న చిన్న తప్పుల్ని కూడా భలే పట్టేస్తున్నారు. బాక్సాఫీసు దుమ్ము దులిపిన సినిమాలకీ వంకలు పెడుతున్నారు. సోషల్ మీడియా అంతా నెత్తిన పెట్టుకొన్న సినిమా ఈ మధ్య రాలేదు. ఇప్పుడు ఆ లోటు `సీతారామం` తీర్చింది.
ఈ సినిమా గురించి సోషల్ మీడియా పూర్తి పాజిటీవ్ కోణంలో స్పందించింది. ఎవరు కాసినా దీన్నో క్లాసిక్ అంటూ అభివర్ణిస్తున్నారు. సినీ సెలబ్రెటీలు సైతం పాజిటీవ్ ట్వీట్లతో హోరెత్తించారు. ఈ ఫీడ్ బ్యాక్ ప్రభావం వసూళ్లపై పడింది. శుక్రవారం ఓ మెస్తరుగా ఉన్న సీతారామం కలక్షన్లు, శనివారం జోరందుకొన్నాయి. శుక్ర, శని వారాలతో పోలిస్తే… ఆదివారం వసూళ్లు రెట్టింపయ్యాయి. చాలా కాలం తరవాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం కనిపించింది. మాస్ సెంటర్లలోనూ… ఫ్యామిలీ ఆడియన్స్ కనిపిస్తున్నారు. ఈమధ్య టాలీవుడ్ లో కలక్షన్లు తగ్గడానికి ఓ బలమైన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవ్వడం. సీతారామం వాళ్లని బాగానే టార్గెట్ చేసి, థియేటర్లకు రప్పించగలిగింది. కుటుంబ ప్రేక్షకులు మళ్లీ సినిమా చూడ్డానికి అలవాటు పడితే థియేటర్లు మళ్లీ కళకళలాడడం ప్రారంభం అవుతుంది.