హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సొంత పార్టీ మహిళా నేతల నుంచి పరోక్ష మద్దతు లభిస్తోంది. ఆయన వీడియో వ్యవహారంపై ఇతర పార్టీల మహిళా నేతలు మండి పడుతూంటే… వైసీపీ నేతలు మాత్రం వీలైనంత సైలెన్స్ పాటిస్తున్నారు. స్పందిస్తున్న కొద్ది మంది కూడా.. గతంలో టీడీపీ హయాంలో అంత కంటే ఎక్కువే జరిగాయిగా అంటున్నారు. అయినా ఆ వీడియో నిజమో కాదో ఎందుకు ఆయనను తప్పు పట్టడం అని సమర్థించేస్తున్నారు. మహిళా సమస్యలపై పోరాడామని చెప్పుకునే నేతలే ఇలా అంటున్నారు.
మంత్రి రోజా కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఆ వీడియో నిజమోకాదో తెలియదంటున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మూడురోజు పాటు సైలెంట్‌గా ఉండి.. నిజమో..కాదో తేల్చిచర్యలు తీసుకోవాలని ఓ లేఖరాసి సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడైనా మీడియా తారసపడుతుందేమోనని బయట కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఆ వీడియోను మర్చిపోయే వరకూ సైలెంట్‌గా ఉండి.. అప్పటివరకూ ఎంపీని దూరం పెట్టినట్లుగా కనిపిస్తే చాలన్నట్లుగా వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని చెబుతున్నారు.
అయితే.. లోక్‌సభ సభ్యుడు వ్యవహరించిన విధానం మాత్రం ఆ పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోంది. వెనుకేసుకురావడం మరింత ఇబ్బందికరం అవుతుంది. అయితే తామేం చేసినా ప్రజలు హర్షిస్తారన్నఓ గొప్ప నమ్మకంలో వైసీపీ లో అన్ని స్థాయిల నేతల్లో ఉంది కాబట్టి.. అందరూ లైట్ తీసుకుంటున్నారు. పైగా సమర్థించుకునే పరిస్థితి వచ్చింది.