సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పార్టీల నేతలు ఏం చేస్తున్నారో చూసి వారిపై విశ్లేషణలు చేసి.. సలహాలివ్వడానికి కూడా తెర ముందుకు వస్తున్నారు. విచిత్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు మోదీతో కలిసిన తర్వాత మీడియాలో.. సోషల్ మీడియా లో ఓ రకమైన చర్చ జరుగుతోంది. 2014 నాటి కూటమి మళ్లీ ఏర్పడుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని… అనుకుంటున్నారని అంటున్నారు. దీనిపై సజ్జల మీడియా సమావేశం పెట్టారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తాము కూడా అంటున్నామని రివర్స్‌లో చెప్పారు.
మోదీనే చంద్రబాబును పిలిచినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని.. మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వెంటీలేటర్‌పై ఉందన్నారు. కకావికలం అవుతున్న ఆ పార్టీ నేతలను కాస్త కాపాడుకోవడానికే..మోదీతో భేటీ గురించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో విజయానికి అడ్డదారులు ఉండవని చెప్పుకొచ్చారు. . ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి తోడులేనిదే టీడీపీ ఎన్నికల్లో పాల్గొనలేదని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి చతికిలబడిందన్నారు. టీడీపీ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారన్నారు.
టీడీపీ గురించి ఇన్ని మాట్లాడిన ఆయన తమ ఎంపీ ఘన కార్యం గురించి చెప్పమంటే నాలుగు రోజుల కిందట చెప్పిందే చెప్పుకొచ్చారు. వీడియో నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎప్పటికి నిజమని తేల్చుకుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. చంద్రబాబుకు సలహాలిచ్చే బదులు.. తమ పార్టీ సంగతి చూసుకోవాలని టీడీపీ నేతలు సజ్జలకు కౌంటర్లు ఇస్తున్నారు.