అధికారం చేతిలో ఉందంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. నైతికంగా విలువలు కనీసం పాటిస్తున్నట్లుగా నటించాలి. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో వీటిని పాటిస్తూనే వస్తున్నాయి. కానీ తొలి సారిగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నైతికంగా దివాలా తీసేసింది. లోక్సభ సభ్యుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడి దొరికిపోతే.. అదంతా ప్రైవేటు వ్యవహారం.. తప్పేముందన్నట్లుగా మాట్లాడి.. సజ్జల రామకృష్ణారెడ్డి .. ప్రజలందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు.
మహిళా పక్షపాత పార్టీ.. కఠినాతి కఠిన చర్యల డైలాగులేమయ్యాయి ?
గోరంట్ల మాధవ్ వీడియో వెలుగులోకి వచ్చిన రోజున పెద్ద నైతిక విలువల పరిరక్షకుడి అవతారం ఎత్తారు సజ్జల. సీఎంతో రెండు సార్లు భేటీ అయినట్లుగా క్యాంప్ ఆఫీసులోకి పోయి వచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడి.. అది మార్ఫింగ్ కాదని తేలితే.. కఠినాతి కఠిన చర్యలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. అప్పుడే ఇక సస్పెన్షన్ లేకపోతే బహిష్కరణ అనే హింట్ ఇచ్చారు. అనుకూల చానళ్లలో ప్రచారం చేయించారు. కానీ రెండు రోజులకే సీన్ మారిపోయింది.
ఎంపీ అసభ్య ప్రవర్తనకు అడ్డగోలు సమర్థన !
ఇప్పుడు ఎంపీ అడ్డగోలు అసభ్య ప్రవర్తనను నిస్సిగ్గుగా సమర్థించే స్థాయికి సజ్జల దిగజారిపోయారు. జుగుస్పాకరంగా వీడియోలో ఉందని.. అది తనది కాదని గోరంట్ల మాధవ్ చెబుతున్నారన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రానప్పుడు చర్య తీసుకునే అవకాశం లేదని సజ్జల తేల్చేశారు. అదే సమయంలో అది నాలుగు గోడల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారం అని.. అసలు బాధితులు లేకపోయినా మీడియానే ఎక్కువ హడావుడి చేస్తోందన్నారు. అది నిలబడేది కాదని చెప్పుకొచ్చారు. నిలబడుతుందో లేదో కానీ పరువు మాత్రం బజారున పడిందన్న విషయాన్ని సజ్జల మర్చిపోయారు. పరువుపోయినా పర్వాలేదు.. ఎంపీని కాపాడుకోవాలని అనుకుంటున్నారు.
దీనికి కులం అంటించి రాజకీయం.. ఏం బావుకుందామని !?
చివరికి సజ్జల టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా తమ అనుకూల మీడియాతో కుల గొడవలు ప్రారంభింపచేశారు. ఎంపీకి కురుబ సామాజికవర్గం అండగా ఉందని.. కమ్మ సామాజికవర్గమే ఇదంతా చేస్తుందన్నట్లుగా ప్రచారం చేయిస్తున్నారు. ప్రదర్శలు చేయించి.. నేరుగా కమ్మ వర్సెస్ కురుబ పేరుతో చర్చలు పెట్టించేస్తున్నారు. ఇప్పటికే ఈ కులాల గొడవలతో ఏపీని దాదాపుగా నిస్తేజం చేసి పడేశారు. ప్రతీ దానికి ఇలా కులం పెట్టుకుని అధికారంలో ఉండి ఏం సాధిస్తారు. కనీసం .. నైతిక విలువల్ని కూడా పాటించలేని దౌర్భాగ్య స్థితికి దిగజారిన తర్వాత అధికారం ఉంటే ఏం ? లేకపోతే ఏం ? అనేది ఎక్కువ మంది భావన. వైసీపీ నేతలకు ఇది అర్థం కాదేమో..?