నంద్యాలలో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు రౌడి షీటర్లు అంతకంటే చాన్స్ ఏముంటుందని కొట్టుకుంటూ తీసుకుపోయి.. కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హతమార్చిపోయారు. కానిస్టేబుల్ అన్న కారణంగానే హత్యకు గురయ్యాడు. పోలీసు కాబట్టే చంపేశారు.
ఎవరికైనా పోలీసులంటే కాస్త భయం ఉంటుంది. రౌడీషీటర్లకైతే ఇంకా ఎక్కువ ఉండాలి. ఉండేది కూడా. ఎక్కడైనా పోలీసులు కనిపించినా వంగి వంగి దండాలు పెడతారు. ఎందుకంటే పోలీసులు కన్నెర్ర చేస్తే తమ బతుకెలా ఉంటుందో వాళ్లకి తెలుసు. అయితే ఇది అప్పుడు.. ఇప్పుడు కాదు.. ఇప్పుడు రౌడీషీటర్లు నేరుగా పోలీసులను మర్డర్ చేస్తున్నారు. ఏదో ఓ రాజకీయ అండ వెదుక్కుని తమను ఎమీ చేయలేని స్థితికి రౌడీలు చేరిపోయారు. అందుకే పోలీసుల్నీ హత్య చేస్తున్నారు. కానీ పోలీసు వర్గాలు నిశ్చేష్టులుగా ఉండిపోతున్నాయి.
ఇప్పుడు నేరుగా హత్య చేశారు కానీ.. పోలీసులపై కొన్నాళ్లుగా వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికార పార్టీ ముసుగులో అనేక మంది దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. ఆ ఉదాసీనతే ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకు వచ్చింది. శాంతిభద్రతలను పక్కన పెట్టి కేవలం రాజకీయ పార్టీ కి పని చేయడం.. ఆ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉండే అసాంఘిక శక్తుల జోలికి వెళ్లలేకపోవడం వంటి వాటితో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు అదే ఆ వ్యవస్థ పరువు పోయేలా చేస్తోంది. సొంత కానిస్టేబుల్‌ను చంపినా.. నిందితుల్ని కూడా వెంటనే పట్టుకోలేని స్థితికి వెళ్లిపోయింది.