సీపీఎస్ రద్దు అంశంపై ఉద్యోగుల ఉద్యమం రణరంగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటో తేదీన సీఎం ఇంటిని ముట్టడిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. వారి సన్నాహాలేమో కానీ పోలీసులు మాత్రం వేల మందిని విజయవాడలో మోహరింప చేశారు. ఎవరైనా విజయవాడ వస్తే.. గ్యారంటీ ఉండదన్న సంకేతాలను పంపుతున్నారు. అదే సమయంలో టీచర్లపై వేధింపులు భారీగా ఉన్నాయి. నోటీసులు ఇవ్వడం.. కుటుంబసభ్యులను వేధించడం వంటివి చేస్తున్నారు. దీంతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం రెట్టింపవుతోంది.
అసలు సీపీఎస్ రద్దు అనే హామీ ఇచ్చింది జగన్. తాము అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. అంతే ఉద్యోగులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకం కాబట్టి వారికి ఆ ఆశ చూపించారు జగన్. వారు కూడా నమ్మారు. ఫలితాన్ని జగన్ అనుభవిస్తున్నారు. కానీ నమ్మిన ఫలితాన్ని మాత్రం ఉద్యోగులు భరిస్తున్నారు. వారం రోజులు కాదు కదా మూడేళ్లయినా స్పందించడం లేదు. ఇప్పుడు అవగాహన లేకుండా ఇచ్చామని సిగ్గులేకుండా చెబుతున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం హామీ నెరవేర్చాల్సిందేనంటున్నారు.
అయితే ఏ హామీతో అయితే లాభం పొంది.. సీఎం ఉద్యోగం పొందారో.. అదే హామీని తుంగలో తొక్కి.. అడుగుతున్న వారిని అణగదొక్కడానికి పూర్తి స్థాయిలో అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ పరిస్థితి సహజంగానే ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకతకు కారణం అవుతోంది. లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు జగన్ మోసాన్ని భరించలేకపోతున్నారు. పీఆర్సీ విషయంలోనే దారుణంగా జగన్ చేసిన మోసానికి వారు మండిపోతున్నారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో బెదిరింపులకు పాల్పడుతూండటంతో.. ఉద్యోగులు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.