వైసీపీ ప్రభుత్వ వ్యహారశైలి అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు అన్న చందాన మారిపోయింది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం .. ఆ జీవోలు కూడా కనిపించకుండా చేయడం.. అమలు చేసేటప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తే.. అలాంటిదేమీ లేదని చెబుతారు. ఈ చెప్పడం కూడా చివరి క్షణం వరకూ కామ్‌గా ఉండి.. చివరిలో చెబుతారు. అప్పటి వరకూ ఆ జీవోను అడ్డం పెట్టుకుని చేయాల్సినవి చేస్తారు. చివరికి వచ్చేసరికి అదంతా తప్పుడు ప్రచారామని బుకాయించడానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం గణేష్ మండపాల విషయంలో జరుగుతోంది అదే.
ఏపీ ప్రభుత్వం గణేష్ మండపాల నిర్వాహకుల నుంచి వివిధ రూపాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పిండుకోవాలని నిర్ణయించుకుంది. కరెంట్ చార్జీలు సహా సౌండ్ బాక్స్ ల వారీగా చార్జీలు వడ్డించింది. ఈ మేరకు అన్నీ కడితేనే అనుమతులు ఇస్తున్నారు. కట్టినా రాజకీయ ప్రత్యర్థులు అంటే అసలు ఇవ్వడం లేదు. ఇది హిందూ పండుగలపై దాడేనన్న టీడీపీ , బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మండపాలు ఏర్పాటు చేయండి ఎవరేం చేస్తారో చూస్తామంటూ పిలుపునిచ్చింది. ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోయింది.
చివరికి పండుగకు రెండు రోజుల ముందు స్పందించిన ఏపీ ప్రభుత్వం.. గణేష్ మండపాల నుంచి ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని అదంతా తప్పుడు ప్రచారమని చెప్పుకుంది. అదే నిజమైతే.. పండుగకు రెండు రోజుల ముందు వరకూ ఎందుకు స్పందించలేదు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన పలు రకాల జీవోలను చూపించి.. గత ప్రభుత్వంలో ఇచ్చినవంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. నిజానికి ఏపీలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ప్రజల్ని ఇలా ఇబ్బందులకు గురి చేయడం.. తర్వాత అదేమీ లేదని చెప్పడం కామన్ అయిపోయింది. అందుకే ఇదేం పాలన అని అనుకుని నవ్వుకోవాల్సిన పరిస్థితులు ప్రజలకు వస్తున్నాయి.