టీఆర్ఎస్ బలం తెలంగాణ సెంటిమెంట్. ఆ బలంతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ అది వర్కవుట్ అవదని అనుకుంటున్నారో లేకపోతే ఇంకా ఎంత కాలంఇక్కడ ఉండాలని అనుకుంటున్నారో కానీ తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అక్కడుకు వెళ్లి ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారో కానీ .. తెలంగాణలో మాత్రం ఆయన వదేలేస్తున్న తెలంగాణ సెంటిమెంట్‌ను రేవంత్ అంది పుచ్చుకోవాలని డిసైడయ్యారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఆ సెంటిమెంట్ ను వర్కవుట్ చేసుకోవడంలో రెండు సార్లు విఫలమైన కాంగ్రెస్ ఈ సారి మాత్రం చాన్స్ మిస్ చేసుకోకూడదని అనుకుంటోంది. తెలంగాణ భావోద్వేగం పెరిగేలా రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్లను రెడీ చేశారు. జాతీయ జెండాతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందిస్తామని.. తాము అధికారంలోకి వస్తే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణలో సబ్బండ వర్ణాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కచెబుతున్నారు. టీఆర్ఎస్ ను పోలి ఉన్నట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ అని తీసుకొచ్చారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని కూడా ప్రకటించారు.
రేవంత్ ప్రతిపాదనలపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వారిలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఇప్పటి రాజకీయాల్లో భావోద్వేగాలే ఓట్లు కురిపించే మిషన్లు. ప్రజలను ఎలా అందులో ముంచగలిగితే అంత విజయం దగ్గరగా ఉన్నట్లు. రేవంత్ రెడ్డి ఈ విషయంలోనూ ఓ రాయి వేసిచూస్తున్నారు. తగిలితే సరే లేకపోతే లేదు అంతే !