రాజమండ్రిలో పుష్కరయాత్రికుల మరణాలపై న్యాయవిచారణ జరిపిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇదేసంఘటనలో బాధ్యులపై చర్యతీసుకోవాలని ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ వేసిన పిటీషన్ ను మానవ హక్కుల కమీషన్ విచారణకు స్వీకరించి నట్టు టివిలో న్యూస్ స్క్రోలింగ్ వచ్చాకే న్యాయవిచారణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణ చేయించి పుష్కరాలు ముగిశాక చర్యలు తీసుకుంటామని ఈ ఉదయం ముఖ్యమంత్రి చెప్పారు. వెంటనే విచారణ, చర్యలు అంటే ఆప్రభావం మిగిలిన 11 పదకొండు రోజుల పుష్కరాల మీద పడుతుందన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని విలేకరులతో అన్నారు.
మంచి పరిపాలనాదక్షుడిగా పేరున్న చంద్రబాబు రాజకీయసహచరుల, అనుచరుల మాటలకే కంటే అధికారుల మాటలకే ఎక్కువవిలువ ఇస్తారు. బ్యూరోక్రాట్ల పట్ల బాబు మెతకతనమో, సాఫ్ట్ కార్నరో కాని వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయంలో కాస్త వెనకడుగే వేస్తారు. (ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసిన మహిళా తాసిల్దార్ విషయంలో మాత్రం ఇది తిరగబడింది) ఇవాళ కూడా ఆ ధోరణినే అనుసరించి పుష్కరాల తరువాతే చర్యలు అన్నారు. ఇందరిని బలిగొన్న అలసత్వం పై చర్యలు కఠినంగానే వుండాలి. ఆకఠనత్వం అధికారుల సహాయ నిరాకరణకు దారితీస్తుందన్న భయమో, ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనో ఈ ఉదయం ముఖ్యమంత్రి మాటల్లో వుంది. హ్యూమన్ రైట్స్ కమీషన్ పిటీషన్ స్వీకరించగానే ముఖ్యమంత్రి న్యాయవిచారణ జరపాలన్న నిర్ణయంలో రెండుకోణాలు కనబడుతున్నాయి. 1.అఫెన్స్ గేమ్ ఆడవలసిన సమయంలో కూడా డిఫెన్స్ గేమ్ కే పరిమితమైయ్యే చంద్రబాబు చివరిదశకు వచ్చాకే నిర్ణయాలు మార్చుకోవడం. 2. ప్రభుత్వాన్ని సవాలు చేసే ఒక ప్రయివేటు పిటీషన్ పై విచారణను చిన్నదిగా చేసి చూపడం.
రాజకీయ ప్రతిష్టను నిలుపుకోవడంలో శక్తిసామర్ధ్యాలు, ఎత్తుగడలు ముఖ్యమైనవే…వాటికంటే ముఖ్యమైనది టైమింగ్…న్యాయవిచారణ నిర్ణయాన్ని ప్రకటించడంలో బాబు టైమింగ్ కాస్త వెనుకబడినట్టే వుంది