కొందరికి రాజకీయాలంటే గేమ్..తనకు మాత్రం టాస్క్ అన్నారు కేసీఆర్. ఇప్పుడు జాతీయ నేతగా మొదటి టాస్క్ ఎన్నికల సంఘంపైనే గురి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్పులో ఆలస్యం.. మునుగోడులో ఈసీ ఆంక్షలు వంటి వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసీపై అసంతృప్తిగా ఉండే ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఢిల్లీలోఈ ధర్నాను ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం గతంలో కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. అలాగే గొర్రెలను పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈ అంశాలపై పోరాటం చేయాలని ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కేంద్రం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును దేశం ముందు ఉంచాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో ఈసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా మునుగోడు పోలింగ్ లోపే ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లవుంది. పైగా ఈసీ వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అంటున్నారు.