‘మా’ ప్రెసిడెంటు అయ్యాక మంచు విష్ణుపై మరింత ఫోకస్ పడింది. ‘మా’లో విష్ణు ఏం చేసినా.. ఏం చేయకపోయినా… అదో కాంట్రవర్సీ అయ్యింది. మైకు పట్టుకొని మాట్లాడితే చాలు.. మీమర్సు, ట్రోలర్సు విజృంభించేవారు. ఇప్పుడు కూడా విష్ణు ఎప్పుడు బయటకు వస్తాడా? కంటెంట్ ఎప్పుడు ఇస్తాడా అని వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. విష్ణు నటించిన ‘జిన్నా’ రేపు విడుదల అవుతోంది. ఈ సినిమా విష్ణు కెరీర్‌కి చాలా కీలకం. ఈ సినిమా హిట్టయితే ఓకే. లేదంటే.. మీమర్స్కీ, ట్రోలర్స్కీ మరోసారి దొరికిపోతాడు.
విష్ణు గత చిత్రం ‘మోసగాళ్లు’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా రూ.50 కోట్లతో తీశామని, హాలీవుడ్ లోనూ రిలీజ్ చేస్తున్నామని విష్ణు డబ్బాలు కొట్టాడు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. మీమర్స్ కి అడ్డంగా దొరికిపోయాడు. `మోసగాళ్లు` తరవాత.. విష్ణు నుంచి వస్తున్న సినిమా ఇదే. మా ప్రెసిడెంటుగా కూడా తొలి సినిమా. ఓ రకంగా.. పెదరాయుడు కుమారుడు ప్రెసిడెంటు గారికి ఇది పెద్ద పరీక్షే. అయితే విష్ణు మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. ‘ఢీ తరవాత.. ఈ సినిమా అంత పెద్ద హిట్టవుతుంది’ అని చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు. ఛోటా కె.నాయుడు. కోన వెంకట్ లాంటి వాళ్లు ఈ సినిమా కోసం పని చేశారు. టెక్నికల్ గా మంచి టీమే దొరికింది. మరి… ఈసారి విష్ణు ఏం చేస్తాడో చూడాలి.