లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. కారణాలేమైనా సరే, ఈ సినిమా విజయ్ దేవరకొండ దూకుడికి కాస్త బ్రేక్ వేసింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు విజయ్.కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు. కనీసం పారితోషికం కూడా అందలేదు. ఈ సినిమా కోసం విజయ్ చాలా తక్కువ మొత్తం అడ్వాన్స్ గా తీసుకొన్నాడు. బిజినెస్ అయ్యాక పూర్తి డబ్బులు ఇస్తామన్నది ఎగ్రిమెంట్. సినిమాకి క్రేజ్ రావడం, మెల్లమెల్లగా పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకోవడంతో.. భారీగా పెట్టుబడి పెట్టారు. విజయ్‌కూడా.. ‘సినిమా అంతా అయ్యాక ఇవ్వండి.. ఇప్పుడు డబ్బంతా సినిమాపై పెట్టండి..’ అని పూరి, ఛార్మిలకు వెసులుబాటు కలిగించాడు. అదే పెద్ద తప్పయిపోయింది.
విడుదలకు ముందు హాట్ స్టార్ ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకొంది. హాట్ స్టార్ ద్వారా వచ్చే డబ్బులు విజయ్ పారితోషికంగా మళ్లించాలన్నది ప్లాన్. ఓటీటీ హక్కుల్ని విజయ్ దగ్గరే ఉండేలా.. ముందస్తు ఒప్పందం జరిగింది. అయితే విడుదలకు ముందు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. ఎన్ ఓ సీలు రావాలంటే నటీనటులకు, స్టూడియోలకు, సాంకేతిక నిపుణులకూ డబ్బులు చెల్లించాల్సివచ్చింది. ఈ సమయంలో.. విజయ్ దగ్గరున్న హాట్ స్టార్ రైట్స్‌ని తిరిగి తమ పేర రాయించుకొని, ఆ డబ్బులతో.. బాకీలు క్లియర్ చేసి, ఎన్ ఓ సీ తెచ్చుకొని సినిమా విడుదల చేయించుకొన్నారు. తీరా సినిమా ఫ్లాప్ అయ్యింది. బయ్యర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఛార్మి, పూరి ఇద్దరూ చేతులు ఎత్తేశారు. ఇప్పుడు పూరిని, ఛార్మిని సంప్రదిస్తుంటే… వాళ్లు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని టాక్. ‘లైగర్’ తరవాత ‘జనగణమన’ చేసుంటే.. విజయ్‌కి రెండు వైపుల నుంచీ.. పారితోషికం అందేది. కానీ.. ‘జనగణమన’ ఆపేయడం వల్ల విజయ్ కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అలా విజయ్ పారితోషికం కూడా ఆగిపోయింది. ఈ సినిమాని విజయ్ దాదాపుగా ఫ్రీగా చేసినట్టు లెక్క.