హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరిజిల్లా కొవ్వూరులో పుష్కర స్నానమాచరించి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానంచేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి దుర్ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యులుకాబట్టి చంద్రబాబు తప్పించుకున్నారని, వేరొకరెవరైనా అయిఉంటే వారిని జైలుకు పంపిఉండేవారని అన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్లో స్నానంచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేదికాదని చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీఐపీ ఘాట్లు ఏర్పాటు చేసినప్పటికీ, పబ్లిసిటీకోసమే సామాన్యుల ఘాట్లో సీఎం రెండున్నర గంటలు పుష్కర పూజలు నిర్వహించారని ఆరోపించారు. తాను చేసిన తప్పుకు విచారణపేరుతో అధికారులను బలి చేయటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు ఎన్ని కోట్లిచ్చినా లోటును పూడ్చలేరని వ్యాఖ్యానించారు.