బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒకరినొకరు చంపుకోవడానికి వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పెట్టినప్పుడు హిందూపురానికి చౌళూరు రామకృష్ణారెడ్డి అనే నేత ఇంచార్జ్ గా ఉండేవారు. అన్నీ తానే చూసుకునేవారు. తర్వాత కొత్త నేతలొచ్చి ఆయనను పక్కకు నెట్టేశారు. అయినా ఆయన పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు. ఇటీవల ఆయనను దారుణంగా హత్య చేశారు. వైసీపీ నాయకులే హత్య చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ ప్లాన్ చేసి మరీ హత్య చేశారని.. ఓ సీఐ సహకరించాడని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
మొత్తం వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కుట్రని క్లారిటీ వచ్చినా పోలీసులు మాత్రం పైపై కేసులు నమోదు చేసి… నిందితుల్ని అరెస్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని కూడా వైసీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని.. అన్ని రాజకీయ పార్టీలు నేతలూ ఏకమయ్యారు. వైసీపీ నేతలు కూడా అఖిలపక్షంగా ఏర్పడి…. రామకృష్ణారెడ్డి హత్య కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఆందోళనలు ప్రారంభించారు. ఈ కేసులో ఏ వన్‌గా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురం వాసి కాదు. కర్నూలు జిల్లాకు చెందిన వారు. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. చంద్రబాబుకు వ్యక్తిగత భద్రతాధికారిగా కూడా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత వైసీపీలో చేరారు. ఆయనకు ఎక్కడా టిక్కెట్ సర్దుబాటు చేయలేక హిందూపురం ఇచ్చారు. అయితే ఆయన ఇలా హత్యా రాజకీయాలకు పాల్పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయనకు సంబంధం లేకుండా పీఏనే హత్యలకు ఎలా పురమాయిస్తారని.. ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై నియోజకవర్గం మొత్తం ఇక్బాల్‌కు వ్యతిరేకంగా మారిపోయింది.