ఏపీలో రోజుకు కోట్ల రూపాయలు క్యాష్ ఒకే చోటకు చేరే బిజినెస్ మద్యం. ప్రతీ నెలా దాదాపుగా మూడు వేల కోట్ల క్యాష్ మద్యందుకాణాలకు చేరుతుంది. ఈ మద్యం దుకాణాలు… సరఫరా.. తయారీ.. అమ్మకాలు మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున బ్లాక్ మనీగా మారి… తరలిపోతోందన్న విమర్శలు వచ్చాయి. ఇటీవల దానిపై దుమారం రేగుతోంది. గన్నవరం, బేగంపేట ఎయిర్ పోర్టులనుంచి ఇలా నగదు తరలిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం… ఇప్పుడు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలని నిర్ణయించింది.
సోమవారం నుంచే ఈ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారని చెబుతున్నారు. నవంబర్ 21 నుంచి నగదు చెల్లింపులతో పాటు కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయానికి స్ధానికంగా షాపుల్లో ఉండే సిబ్బంది చేతివాటాలతో గండి పెడుతున్నారని.. అందుకే డిజిటల్ చెల్లింపుల్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వం కవరింగ్ చేసుకుంది. మూడున్నరేళ్ల పాటు వీటిని గుర్తించలేదా అంటే.. అలాంటివి ఎవరూ అడగకూడదన్నమాట.
అయితే పూర్తిగా డిజిటల్ పేమెంట్స్‌కే పరిమితం చేయడం లేదు. నగదు అమ్మకాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం ఇలా ప్రకటన చేస్తుంది కానీ.. డిజిటల్ పేమెంట్స్‌లో సాంకేతిక లోపాలు సృష్టించి.. అనధికారికంగా క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ చేయదని గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే.. నగదు మీదనే ఎక్కువ రాజకీయం నడుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభు్తవ చిత్తశుద్ధి ఏమిటో సోమవారం నుంచి వెలుగు చూసే అవకాశం ఉంది.