ఆంధ్రప్రదేశ్‌లో నిన్నామొన్నటి వరకూ పచ్చగా ఉన్న అక్వా పరిశ్రమనూ ప్రభుత్వం పడుకోబెట్టేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఒకటే హైరానా పడుతోంది. అక్వా రైతుల్ని టీడీపీ రెచ్చగొడుతోందని.. వారికి వస్తున్న నష్టాలకు ప్రభుత్వం కారణం కాదని.. అంతర్జాతీయ పరిస్థితులే కారణమని వాదిస్తూ వస్తోంది. దీనికి కారణం అక్వా రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించడమే.
వైసీపీ ఫ్యాక్షన్ తరహా వ్యూహంలో భాగం అయిన బాధితులతోనే… ” తమ నష్టాలకు కారణం ప్రభుత్వం కాదు.. తమ కూల్చివేతలకు కారణం ప్రభుత్వం కాదు.. అని చెప్పించే” వ్యూహాన్ని కూడా అమలు చేయించారు. రొయ్యల ఎగుమతి దారుల సంఘం పేరుతో ఓ ప్రకటనను పత్రికలకూ విడుదల చేయించి.. ప్రభుత్వం కారణం కాదని.. ప్రతిపక్షాలు అలా ప్రచారం చేస్తున్నాయని ప్రకటించారు.
ఈ పరిణామాలన్నీ చూస్తూంటే… ప్రభుత్వం ఇంత కంగారు పడుతోందంటే.. ఏపీ అక్వారంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఇటీవల రొయ్యల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. కొన్ని కీలక దేశాలు దిగుమల్ని ఆపేశాయి. అత్యధికంగా ఎగుమతుల మీద ఆధారపడే ఏపీ అక్వా రంగానికి దీంతో దెబ్బ తగిలింది. ఇదే సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా.. ఎగుమతి దారుల నుంచి కమిషన్లు తీసుకుని మద్దతు ధర తగ్గించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మద్దతు ధరలను.. సిండికేట్‌కు అనుకూలంగా ఉండేలా తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రొయ్యల రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. పంట విరామం ప్రకటిస్తున్నారు.
అక్వా విషయంలో ఏపీ మొదటి నుంచి నెంబర్ వన్‌గా ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగిన విధంగా కరెంట్ సరఫరా చేయకపోవడం.. అధిక బిల్లుల దగ్గర్నుంచి పాలనా పరమైన అంశాల్లో నిర్లక్ష్యం.. రైతుల్ని పట్టించుకోకపోవడంతో ఘోరంగా నష్టపోతున్నారు. అయితే ఇదంతా ప్రతిపక్షాల ప్రచారమేనని నమ్మించేందుకు.. ప్రభుత్వం అలవాటైనా ప్రచారబాటను ఎంచుకుంది. అంత మాత్రాన రైతుల నష్టాలు తగ్గిపోవుగా..? ప్రభుత్వ పాలనా వైఫల్యం … కనిపించకుండా పోదుగా ?