ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారు సర్వం కోల్పోయారు. కుటంబసభ్యులనూ కోల్పోయారు. ఆ విషయం స్పష్టంగా కళ్ల ఎదుటే ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యాం కొట్టుకుపోవడానికి వైసీపీ నేతల స్వార్థం.. మరమ్మతులకు నిధులు ఇవ్వని ప్రభుత్వ నిర్వాకం కారణం. అలాంటప్పుడు బాధితుల్ని ఎలా ఆదుకోవాలి. తమ తప్పు వల్ల అంత మంది ప్రాణాలు పోయాయని.. ఆస్తులు కోల్పోయారని.. తప్పు ఫీలవ్వాలి. ప్రాణాలు తెచ్చివ్వలేరు కానీ.. కనీసం ఆదుకోవాలి. అయితే పాలకులకు అలాంటి హృదయమే లేదు. వారేదో పాపం చేశారు కాబట్టి వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజంగా వారు చేసిన పాపం ఏమిటంటే.. వైసీపీకి ఓటేయడమే.
ప్రభుత్వ తప్పిదం వల్లే బాధితులైన అన్నమయ్య ప్రాజెక్ట్ పరిసర గ్రామ ప్రజలు
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల నాలుగు గ్రామాలు ప్రభావితమయ్యాయి. వారి ఇళ్లు కొట్టుకుపోయాయి. వారి పొలాల్లో ఇసుక మేటలు వేసింది. తినడానికి తిండి లేదు. చేసుకోవడానికి పని లేదు. సర్వం కోల్పోయారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి..? . ఏం చేస్తోంది ? ఐదు వేలో పదివేలో చెతిలో పెట్టి.. గొప్ప సాయం చేసుకున్నట్లుగా ప్రకటించుకుంది. ఆ తర్వాత వారి వైపు చూస్తున్న దిక్కు లేదు. ఇళ్లు కట్టిస్తామని కబుర్లు చెప్పి వాళ్లను షెడ్లలోనే ఉంచి నరకం చూపిస్తున్నారు. పొలాల్లో మేట వేసిన ఇసుకను తీసేయడానికి కూడా సహకరించడం లేదు. వారి బాధ వర్ణనాతీతం.
ఎవరి ఖర్మకు వారే బాధ్యులన్నట్లుగా ప్రభుత్వ పెద్దల వికటాట్టహాసం
అప్పట్లో జరిగిన విషాదం సమయంలో చాలా మంది స్వచ్చందంగా వారికి సాయం చేశారు. తానా వంటి సంస్థలు కొన్ని షెడ్లు వేశాయి. టార్పాలిన్లు పంచారు. వాటితోనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు కానీ.. ప్రభుత్వం మాత్రం పైసా మంజూరు చేయడం లేదు. ఓ పాతిక కోట్లు వెచ్చిస్తే.. కనీసం వారికి గృహ వసతి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఇంత వరకూ ప్రాజెక్ట్ ను మళ్లీ కట్టాలనే ఆలోచన చేయడం లేదు. మీడియాలో హైలెట్ అయినప్పుడు .. పరిపాలనా అనుమతులంటూ జీవోలు జారీ చేస్తున్నారు. ఇలాంటి పనికిరాని జీవోలు ఏపీలో ఎన్ని ఉన్నాయో లెక్కించడం కష్టం.
సలహాదారులకు దోచిపెట్టే డబ్బుల్లో ఓ పదిశాతంతో అన్నమయ్య బాధితులకు సాయం చేయవచ్చు..!
పాలకుడికి కాస్తంతైనా మనసు ఉండాలి . బాధల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలన్న పట్టింపు ఉండాలి. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులన్నట్లుగా ఉండే పాలకుడు ఉండే.. అన్నమయ్య లాంటి ప్రాజెక్ట్ బాధితులు బాధితులుగానే ఉండిపోతారు. వారానికో సలహాదారును నియమించి.. వారికి నెలకు రూ. నాలుగైదు లక్షలు ఇవ్వడానికి ఖజానాలో కాసులు గలగలమంటూ ఉంటాయి కానీ.. తమ ప్రభుత్వ నిర్వాకం వల్ల బాధలు పడుతున్న వారికి మాత్రం కనీసం సాయం చేయరు. ఇదేం ఖర్మ అని వారు అనుకోవాల్సిందే.