రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ను ఎప్పటికైనా ఉన్నత స్థానంలో చూస్తామని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి తాను చదువుకున్న నర్సాపురంలోని వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థులంతా హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదన్నారు. చాలా కష్టపడాలని.. తాను రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు.. తనకు ఈ రాజకీయాలు అవసరమా అని చాలా సార్లు అనుకున్నానన్నారు. రాజకీయాల్లో ఉండాలంటే అనేక మందితో మాటలు పడాలి.. మాటలు అనాలన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ గట్టిగా పోరాడుతున్నారన్న అభిప్రాయంతో చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పవన్ కల్యాణ్ ఉన్నత స్థానంలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలకు పవన్ తగిన వ్యక్తని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం అయినప్పటికీ చిరంజీవి రాజకీయాలను ప్రస్తావించారు. అయితే ఇటీవల మోదీతో పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత …రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వాటిలో చిరంజీవి ప్రస్తావన కూడా ఉంది. అందుకే స్పందించారని అనుకుంటున్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పు చూపించిన వ్యవహారాన్ని కూడా చిరంజీవి తన ప్రసంగం ద్వారా సమర్థించినట్లయింది. రాజకీయాల్లో మాటలు పడాలి. .అనాలన్నారు. ఇప్పటి వరకూ పవన్ మాటలు పడ్డారని.. అంటున్నారని అన్నట్లుగా చిరంజీవి చెప్పుకొచ్చారు. ఏ దశలోనూ చిరంజీవి తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం లేదు.. కానీ తమ్ముడికి మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు.